Ireland Vs West Indies T20 Match
west indies vs ireland: వెస్టిండీస్, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. రెండు జట్లు కలిపి 450 పరుగులు చేశాయి. ఈ క్రమంలో పలు రికార్డులు నమోదయ్యాయి. అయితే, చివరికి వెస్టిండీస్ జట్టుపై ఐర్లాండ్ 62 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఒకవైపు వెస్టిండీస్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఐర్లాండ్ యువ ఫాస్ట్ బౌలర్ లియామ్ మోక్‌కార్తీ తన అరంగేట్రం మ్యాచ్‌లోనే చెత్తరికార్డును నమోదు చేశాడు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 256 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది టీ20 చరిత్రలో వెస్టిండీస్ జట్టు చేసిన రెండో అత్యధిక స్కోర్. వెస్టిండీస్ జట్టు తరపున ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన ఎవిన్ లూయిస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఎవిన్ లూయిస్ కేవలం 44 బంతుల్లో 91 పరుగులు చేశాడు. అతని తుఫాన్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సులు ఉన్నాయి. ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ షాయ్ హోప్ కూడా 27 బంతుల్లో 51 పరుగులతో ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తన కెరీర్ లో తొలి టీ20 మ్యాచ్ ఆడిన కేసీ కార్టీ 22 బంతుల్లో 49పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తరువాత రోమారియో షెపర్డ్ కూడా చివరి ఓవర్లలో ఐర్లాండ్ బౌలర్లను వదిలిపెట్టలేదు. కేవలం ఆరు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టడం ద్వారా జట్టుకు 19 పరుగులు జోడించాడు. దీంతో వెస్టిండీస్ జట్టు 256 పరుగుల భారీ స్కోర్ చేసింది.
వెస్టిండీస్ జట్టు నిర్ధేశించిన భారీ పరుగుల లక్ష్యాన్ని ఐర్లాండ్ చేధించలేక పోయింది. ఐర్లాండ్ బ్యాటర్లు రాస్ అడైర్ (48), హ్యారీ టెక్టర్ (38), మార్క్ అడైర్ (31) మినహా మిగిలిన బ్యాటర్లు పరుగుల రాబట్టలేక పోయారు. దీంతో ఐర్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 194 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా 62 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. వెస్టిండీస్ బౌలింగ్‌లో అఖిల్ హుస్సేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాసన్ హోల్డర్ రెండు వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్ ఐర్లాండ్ యువ బౌలర్ లియామ్ మెక్‌కార్తీకి పీడకలను మిగిల్చింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు ఇచ్చి బౌలర్‌గా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. అతను నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 81 పరుగులు ఇచ్చాడు. ఇతనికంటే ముందు గాంబియాకు చెందిన ముసా జోబార్టే 2023లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 93 పరుగులు ఇచ్చి చెత్త రికార్డును నమోదు చేశాడు. అతని తరువాత స్థానంలో లియామ్ మెక్‌కార్తీ టీ20 మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు.
Just shy of a 3rd T20I ton!😬
A nearly perfect innings.👏🏾 #IREvWI pic.twitter.com/aUbdWJSxFA
— Windies Cricket (@windiescricket) June 15, 2025