Rishabh Pant Rs 27 Crore Price Tag Affecting Him
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒంటి చేత్తో మ్యాచ్ గమనాన్ని మార్చే సత్తా అతడి సొంతం. ఐపీఎల్ 2025లో అతడు లక్నో సూపర్ జెయింట్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు లక్నో జట్టు మూడు మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్‌లో గెలవడంతో ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఏడో స్థానంలో కొనసాగుతోంది.
అయితే.. రిషబ్ పంత్ కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా పూర్తిగా విఫలం అయ్యాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 0, 15, 2 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడి ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మ్యాచ్‌ల్లో ఓటమి అనంతరం లక్నో జట్టు యజమాని మైదానంలో పంత్ తో సీరియస్ గా మాట్లాడుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Pakistan : వన్డే సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్ .. భారీ జరిమానా..
రూ.27 కోట్లు పెట్టి కొంటే..?
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ విషయం పంత్ పై ఒత్తిడి పెంచుతుందా? భారీ అంచనాలను అందుకోవాలనుకునే క్రమంలో అతడు విఫలం అవుతున్నాడా ? అన్నప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
దీనిపై టీమ్ఇండియా మాజీ ఆటగాడు పీయూష్ చావ్లా స్పందించాడు. అలాంటిది ఏదీ లేదని చెప్పాడు. ‘రిషబ్ పంత్ గురించి నాకు తెలుసు. వేలం ధర అతడి పై ప్రభావం చూపుతుంది అని అనుకోను. అతడు ప్రస్తుతం ఫామ్‌లో లేడు. గత కొన్నాళ్లుగా అతడు వైట్ క్రికెట్ ఆడలేదు. గత సీజన్లలో అతడి ప్రదర్శన చూసిన తరువాత ఐపీఎల్ 2025లో కెప్టెన్‌గా రావడంతో అతడి పై భారీ అంచనాలు ఉన్నాయి.’ చావ్లా తెలిపాడు.
ముందుగా క్రీజులో కుదురుకోవాలని చావ్లా సూచించాడు. సింగిల్స్ తీసి స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని పొందాలని, ఒక్కసారి కుదురుకుంటే పంత్‌ను ఆపడం కష్టమన్నాడు.
కాగా.. నేడు లక్నోలోని ఎకానా స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. హోంగ్రౌండ్‌లో ఆడనుండడం లక్నోకు కాస్త కలిసి వచ్చే అంశం. మరి ముంబైతో మ్యాచ్‌లోనైనా పంత్ ఫామ్ అందుకుంటాడో లేదో చూడాలి మరి.