Yashasvi Jaiswal : ముంబైని వీడి గోవాకు యశస్వి జైస్వాల్ వెళ్లడం వెనుక ఉన్న కారణం అదేనా? అజింక్య రహానే కిట్‌బ్యాగ్‌ను కోపంతో తన్నాడా?
దేశవాళీ క్రికెట్‌లో యశస్వి జైస్వాల్ ముంబైని వీడి గోవాకు వెళ్లాడు.

Why Jaiswal made shocking switch from Mumbai to Goa
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అతడు ముంబై జట్టుకు గుడ్ బై చెప్పాడు. 2025-26 సీజన్‌లో అతడు గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ అతడు ముంబై క్రికెట్ సంఘానికి(ఎంసీఏ) లేఖ రాశాడు. అటు ఎంసీఏ కూడా అతడికి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ)ని మంజూరు చేసింది.
దీనిపై ఇప్పటికే యశస్వి జైస్వాల్ స్పందించాడు. ఇది చాలా కఠినమైన నిర్ణయం అని చెప్పాడు. ఈరోజు తాను ఇలా ఉన్నాన్నంటే అందుకు ముంబైనే కారణం అని చెప్పాడు. ఈ నగరం తనకు ఎంతో ఇచ్చిందని, ఇందుకు తాను తన జీవితాంతం ఎంతో రుణపడి ఉంటానని చెప్పాడు. అయితే.. గోవా తనకు ఓ కొత్త అవకాశాన్ని ఇచ్చిందన్నాడు. కెప్టెన్సీ ని ఆఫర్ చేసినట్లుగా తెలిపాడు.
ఏదీ ఏమైనప్పటికి తన మొదటి లక్ష్యం టీమ్ఇండియాకు ఆడడమే అని అన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు గోవా తరుపున ఆడతానని, జట్టును ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని యశస్వి చెప్పుకొచ్చాడు.
రహానేతో యశస్వి గొడవ..!
ముంబైని యశస్వి వీడడానికి కారణం ఆ జట్టు కెప్టెన్ అజింక్యా రహానే అని పలు వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
గత రెండేళ్లుగా రహానె, జైస్వాల్‌కు మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. 2022లో వెస్ట్‌జోన్‌కు కెప్టెన్‌గా రహానే ఉండగా, అతడి సారథ్యంలో యశస్వి ఆడాడు. సౌత్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో అసలు కథ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్ ఆటగాడు రవితేజను యశస్వి స్లెడ్జింగ్ చేశాడు. అయితే.. అతడు హద్దు దాటుతున్నట్లుగా భావించిన రహానే మైదానం నుంచి యశస్విని బయటకు పంపించివేశాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఘర్షణ ప్రారంభమైందని ఇండియా టుడే తన కథనంలో తెలిపింది.
రెండు సీజన్ల క్రితం సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరపున ఆడుతున్నప్పుడు జైస్వాల్ షాట్ ఎంపిక గురించి నిరంతరం ప్రశ్నలు అడగడం కూడా మరో కారణం. జట్టు యాజమాన్యం తనను తప్పుగా లక్ష్యంగా చేసుకున్నట్లు జైస్వాల్ భావించి ఉండొచ్చు అని చెప్పింది.
ఇక మూడో కారణం.. గత రంజీసీజన్‌లో ముంబై పై జమ్ముకశ్మీర్ చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో జట్టు యాజమాన్యం అతడి పై విమర్శలు గుప్పించింది. కోచ్ ఓంకార్ సాల్వి, కెప్టెన్ రహానేలు జైస్వాల్ నిబద్ధత గురించి ప్రశ్నించారు. ఆ సమయంలో జైస్వాల్ కోపంతో రహానే కిట్‌బ్యాగ్‌ను తన్నాడని పరిస్థితికి దగ్గరగా ఉన్న వ్యక్తులు చెప్పినట్లు పేర్కొంది.
ఈ ఘటనల కారణంగా జైస్వాల్ ముంబైని వీడినట్లుగా తెలుస్తోంది.