KKR vs SRH : వరుసగా మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమి.. కెప్టెన్ కమిన్స్ కామెంట్స్ వైరల్.. మేం ఎందుకు ఓడిపోతున్నామంటే..?
ఎస్ఆర్‌హెచ్ ఓటమిపై కెప్టెన్ కమిన్స్ నిరాశను వ్యక్తం చేశాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో మ్యాచ్‌లో ఓడిపోయింది. గురువారం కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 80 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమిపై ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ కమిన్స్ నిరాశను వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్‌లో కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ (60; 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), అంగ్క్రిష్ రఘువంశీ (50; 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేయగా రింకూ సింగ్ (32నాటౌట్; 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) దంచికొట్టాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో షమి, కమిన్స్, హర్షల్ పటేల్, కమిందు మెండిస్, జీషన్ అన్సారీ లు తలా ఓ వికెట్ తీశాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. హెన్రిచ్ క్లాసెన్ (33), కమింద్ మెండిస్ (27)లు ఫర్వాలేదనిపించారు. ట్రావిస్ హెడ్ (4), అభిషేక్ శర్మ (2), ఇషాన్ కిషన్(2) లు ఘోరంగా విఫలం అయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తిలు చెరో మూడు వికెట్లు తీశారు. ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా, సునీల్ నరైన్‌లు చెరో వికెట్ సాధించారు.
మ్యాచ్ అనంతరం ఓటమిపై పాట్ కమిన్స్ స్పందించాడు. ఈ రోజు కలిసి రాలేదన్నాడు. వికెట్ బాగుందని, ఫీల్డింగ్ లో తాము కొన్ని తప్పిదాల వల్ల అవకాశాలను కోల్పోయామని చెప్పాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం జట్టుకు మంచిది కాదన్నాడు. తమ బౌలింగ్ బాగానే ఉందని, ఫీల్డింగ్ బలహీనంగా ఉందన్నాడు.
ఇక తమ ప్రధాన స్పిన్నర్ ఆడమ్ జంపాను కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆడించకపోవడంపై స్పందిస్తూ.. ఈ వికెట్‌కు స్పిన్‌కు అనుకూలం కాదన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము కేవలం మూడు ఓవర్లు మాత్రమే స్పిన్ బౌలింగ్ చేశామన్నారు. అందుకనే జంపాకు అవకాశం ఇవ్వలేదన్నాడు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని చెప్పాడు. అయితే.. ఈ ఓటమి గురించి పెద్దగా ఆలోచించమని చెప్పాడు. తదుపరి మ్యాచ్ పై దృష్టి సారిస్తామని కమిన్స్ అన్నాడు.