Clicky Ponting : ఇదేం స్కామ్‌రా అయ్యా.. అంపైర్‌నే మాయ చేశావుగా.. చిటిక వేసి ఔట్.. వీడియో వైరల్..
ఈ ఘటనకు సోషల్ మీడియాలో అభిమానులు క్లిక్కీ పాంటింగ్ (Clicky Ponting ) అనే పేరు పెట్టారు.
Its not cricket cheating row as Clicky Ponting appears to dupe umpire
Clicky Ponting : క్రికెట్లో అప్పుడప్పుడు స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, బాల్ టాంపరింగ్ వంటి ఆరోపణలు రావడాన్ని చూసే ఉంటాం. కానీ.. ఇంగ్లీష్ క్లబ్ క్రికెట్లో ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లాండ్‌లోని నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ డర్హామ్ క్రికెట్ లీగ్ డివిజన్-2 (NYSD ) మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రపంచ క్రికెట్లో సంచలనంగా మారింది.
సాల్ట్‌బర్న్ క్రికెట్ క్లబ్ 2nd XI జట్టు, నార్టన్ క్రికెట్ క్లబ్ 2nd XI జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వివాదం చెలరేగింది. నార్టన్ బ్యాటర్ నోమన్ షబీర్ బ్యాటింగ్ చేస్తుండగా ప్రత్యర్థి బౌలర్ బంతిని వేయగా డిఫెన్స్ ఆడాడు. అయితే.. బంతి బ్యాట్‌ను తాకకుండా వికెట్ కీపర్ చేతుల్లో వెళ్లింది. కానీ.. బంతి బ్యాట్‌ను దాటి వెలుతున్న సమయంలో సాల్ట్‌బర్న్ స్లిప్ ఫీల్డర్ అయిన బ్రియాన్ డివైన్ చేతి వేళ్లతో చిటికెలు వేశాడు.
సాల్ట్‌బర్న్ ఆటగాళ్లు ఔట్ కోసం అప్పీల్ చేయగా.. ఆ క్లిక్కీ శబ్దాన్ని బ్యాట్ ఎడ్జ్‌గా భావించిన అంపైర్.. బ్యాటర్‌ను ఔట్ గా ప్రకటించాడు. తాను ఔట్ కాదని, స్లిప్ ఫీల్డర్ చేతిలో శబ్ధం చేశాడని బ్యాటర్ ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమేచ్యూర్ క్రికెట్లో డీఆర్ఎస్, అల్ట్రాఎడ్జ్ లేదా స్నికోమీటర్ వంటి సాంకేతిక సదుపాయాలు లేకపోవడంతో అంపైర్లు తాము విన్న శబ్దం, చూసిన దృశ్యాల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటారు అన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఈ ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై అధికారిక ఫిర్యాదు అందినట్లు NYSD క్రికెట్ లీగ్ ప్రకటించింది. దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించింది.
Cheating level pro max
A club cricketer in England clicked his fingers to simulate a nick to the keeper. Bat nowhere near the ball but the Umpire heard the sound and gave it out. The English spirit of cricket on display. pic.twitter.com/koU7Mhmkki— ηᎥ†Ꭵղ (@nkk_123) July 28, 2026
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సాల్ట్‌బర్న్ వికెట్‌కీపర్ జోష్ బోవ్స్ గణాంకాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఈ సీజన్లో కేవలం ఎనిమిది లీగ్ మ్యాచ్‌ల్లోనే అతడు 31 క్యాచ్‌లు పట్టడం అనుమానాలకు తావిచ్చింది. ముఖ్యంగా షిల్డన్ రైల్వే క్లబ్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో ఎనిమిది క్యాచ్‌లు అందుకోవడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. పురుషుల టెస్టు క్రికెట్లో ఒక వికెట్‌కీపర్ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా ఏడు క్యాచ్‌లే పట్టిన రికార్డు ఉండగా, బోవ్స్ ఎనిమిది క్యాచ్‌లు అందుకోవడం చర్చకు దారితీసింది.
The worst case of cheating in cricket, allegedly pic.twitter.com/O411A0nM4G
— The Grade Cricketer (@gradecricketer) July 28, 2026
ఇతర క్లబ్‌లు కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయి. మిడిల్స్‌బ్రో 2nd XI జట్టు కెప్టెన్ రోరీ కాటెరిల్ తమ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని పేర్కొన్నాడు. అలాగే సాల్ట్‌బర్న్ క్లబ్‌కు చెందిన కొన్ని పాత మ్యాచ్‌ల లైవ్‌స్ట్రీమ్ వీడియోలు అధికారిక ఛానెల్‌ల నుంచి తొలగించబడినట్లు నివేదికలు వచ్చినప్పటికీ, వాటికి ఈ ఆరోపణలతో ప్రత్యక్ష సంబంధం ఉందని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.
దీనిని ‘క్లిక్కీ పాంటింగ్’ అని ఎందుకు పిలుస్తారు?
ఈ ఘటనకు సోషల్ మీడియాలో అభిమానులు క్లిక్కీ పాంటింగ్ అనే పేరు పెట్టారు. బ్యాట్ ఎడ్జ్ శబ్దాన్ని అనుకరించేలా వేళ్లతో క్లిక్కీ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో “రికీ” స్థానంలో క్లిక్కీ అనే పదాన్ని ఉపయోగించారు. మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ పేరును సరదాగా జోడించినప్పటికీ, ఈ ఘటనతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని అభిమానులు స్పష్టం చేస్తున్నారు. అయితే.. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, వ్యాఖ్యాతలు, అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
