Jannik Sinner Becomes First Italian Man To Reach US Open Final
US Open 2024 : ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, ఇటలీ స్టార్ ప్లేయర్ జనిక్ సినర్ అదరగొడుతున్నాడు. యూఎస్ ఓపెన్2024 లో ఫైనల్‌కు చేరుకున్నాడు. సెమీస్‌లో బ్రిటన్‌కు చెందిన జాక్ డ్రేపర్‌ను 7-5, 7-6 (7/3), 6-2తో ఓడించాడు. ఈ క్రమంలో యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి ఇటలీ ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.
ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం సినర్ మాట్లాడుతూ.. పైనల్‌కు చేరుకునందుకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. జాక్ తనకు మంచి స్నేహితుడని చెప్పుకొచ్చాడు. అయితే.. మ్యాచులో మాత్రం ఇద్దరం ప్రత్యర్థులమేనని అన్నాడు. ఫైనల్‌లో తన ప్రత్యర్థి ఎవరైనా సరే మ్యాచ్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నాడు.
అటు ఫ్రిట్జ్..
మరోవైపు ఇంకో సెమీఫైనల్ మ్యాచ్‌లో అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకువెళ్లాడు. మరో అమెరికా ఆటగాడు ఫ్రాన్సెస్ టియాఫోపై 4-6, 7-5, 4-6, 6-4, 6-1పై గెలుపొందాడు. ఈ మ్యాచ్ హోరా హోరీగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరు ఆటగాళ్లు పోరాడాడు. చెరో సెట్‌లో విజయం సాధిస్తూ మ్యాచ్‌ను చివరి వరకు తీసుకువెళ్లారు. ఇక ఆఖరి కీలకమైన ఐదో సెట్‌లో ఫ్రిట్జ్ చెలరేగిపోయాడు. టియాఫోకు అవకాశం ఇవ్వకుండా సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
ఆదివారం ఫైనల్‌లో జనిక్ సినర్, టేలర్ ఫ్రిట్జ్ తలపడనున్నారు.