టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నారు. ఈ టోర్నీ ముగిసిన తరువాత భారత జట్టు జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్.. ఇంగ్లాండ్ జట్టుతో 5 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక అయ్యే ఆటగాళ్ల గురించి ఇప్పటికే చర్చ మొదలైంది. రోహిత్ శర్మ సారథ్యంలోనే భారత్ ఈ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషిస్తాడని అంతా ఆశిస్తున్నారు. అయితే.. టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న బుమ్రాను ఇంగ్లాండ్ పర్యటనలో ఆ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ పర్యటనలో బుమ్రా ఐదు టెస్టు మ్యాచ్‌ల్లో ఆడకపోవచ్చునని, ఈ కారణంగా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించనున్నట్లు సదరు వార్తల సారాంశం.
Viral Video : అదెం గుండెరా బాబు.. జేబులోనే పెట్టుకొని వచ్చాడుగా.. పరిగెడుతుండగా జారిపడింది..
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం.. ఐదు టెస్టులు ఆడే ఆటగాడిని కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా నియమించాలని సెలెక్టర్లు ఆసక్తిగా ఉన్నారని తెలిపింది. బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడటం లేదని నివేదిక పేర్కొంది.
‘ఐదు టెస్ట్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే ఆటగాడిని మేము కోరుకుంటున్నాము. అలాంటి ఆటగాడినే వైస్ కెప్టెన్ చేయాలని అనుకుంటున్నాము. బుమ్రా ఐదు మ్యాచ్‌లూ ఆడడు. కాబట్టి వేర్వేరు ఆటలకు వేర్వేరు డిప్యూటీలను నియమించడం మాకు ఇష్టం లేదు. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఖచ్చితంగా ఐదు టెస్ట్‌లు ఆడటం మంచిది.’ అని ఆ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో తెలిపాయి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఈ సిరీస్ అనంతరం దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరం అయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడిపై పని భారం పెరగకుండా చూడాలని, ఇంగ్లాండ్ పర్యటనల్లో అతడిని ఐదు టెస్టుల్లోనూ ఆడించకూడని ఇప్పటికే పలువురు మాజీ ఆటగాళ్లు సూచించిన సంగతి తెలిసిందే.
తదుపరి వైస్ కెప్టెన్ ఎవరు?
తదుపరి కెప్టెన్ అయ్యే అవకాశం ఉన్న ఆటగాడిని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తుంటారు. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ లు ఇద్దరిలో ఒకరు వైస్ కెప్టెన్‌గా ఎంపిక అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.