PBKS vs LSG : రిషబ్ పంత్ జట్టు పై విజయం.. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆనందానికి అంతే లేదుగా.. అదృష్టం ఊరికే కాదు..
లక్నో పై విజయం తరువాత పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఆదివారం ధర్మశాల వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో పంజాబ్ కు ఇది ఏడో విజయం కావడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (91; 48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు) సత్తా చాటాడు. శ్రేయస్ అయ్యర్ (45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శశాంక్ సింగ్ (33 నాటౌట్; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. లక్నో బౌలర్లలో ఆకాష్ మహరాజ్ సింగ్, దిగ్వేష్ రతిలు చెరో రెండు వికెట్లు తీశారు. ప్రిన్స్ యాదవ్ ఓ వికెట్ సాధించాడు.
IPL 2025: పంజాబ్ జట్టుపై ఓటమి తరువాత రిషబ్ పంత్ కీలక కామెంట్స్.. ‘కల ఇంకా సజీవంగా ఉంది’
అనంతరం ఆయుష్ బదోని (74; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (45; 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించినా లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెటలు తీశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్, చాహల్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
లక్నో పై విజయం సాధించడంతో ఎంతో సంతోషంగా ఉందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. తమ జట్టు ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. కాస్త అదృష్టం కూడా కలిసి వచ్చిందని, అయితే.. అది కూడా ఊరికే రాదని కష్టపడితేనే వస్తుందన్నాడు.
మ్యాచ్ అనంతరం అయ్యర్ మాట్లాడుతూ.. నిజాయితీగా చెప్పాలంటే అందరూ ఆటగాళ్లు సరైన సమయంలో సత్తా చాటారు. ప్రతి ఒక్కరు జట్టు విజయం కోసం తమ వంతు కృషి చేశారు. ఇక ప్రభ్ సిమ్రాన్ సింగ్ అసాధారణంగా ఆడాడు. అతడు ఆడుతుంటే కళ్లకు కనువిందుగా ఉంది. అని అన్నాడు.
ఇక ధర్మశాలలో పంజాబ్‌కు గొప్ప రికార్డు లేదు. దీని గురించి మాట్లాడుతూ.. ధర్మశాలలలో పేలవ రికార్డు గురించి తెలియకపోవడం మంచిదైంది అన్నాడు. గెలవాలన్న మైండ్ సెట్‌తోనే తాము గ్రౌండ్‌లో అడుగుపెట్టామని, గణాంకాల గురించి ఆలోచించడం లేదన్నాడు.
లక్నో పై విజయం సాధించడంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు పంజాబ్ 11 మ్యాచ్‌లు ఆడింది. 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. 15 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. నెట్‌రన్‌రేట్+0.376గా ఉంది.