IPL 2023: అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 45 శ‌త‌కాలు.. అయినా ఐపీఎల్‌లో బెంచీకే ప‌రిమితమైన స్టార్ క్రికెట‌ర్‌

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 45 శ‌త‌కాలు చేసినా, ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీతో పోటీ ప‌డినా ఓ క్రికెట‌ర్‌ మాత్రం అరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్నాడు. అత‌డు మ‌రెవ‌రో కాదు ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు జోరూట్‌.

IPL 2023: అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 45 శ‌త‌కాలు.. అయినా ఐపీఎల్‌లో బెంచీకే ప‌రిమితమైన స్టార్ క్రికెట‌ర్‌

Joe Root not yet his ipl debut

Updated On : May 4, 2023 / 6:21 PM IST

IPL 2023: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. కుర్రాళ్లు ఈ లీగ్‌లో స‌త్తా చాటితే చాలు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసేందుకు ద్వారాలు తెర‌చుకున్న‌ట్లే. ఇక ఫామ్‌లేమితో జ‌ట్టులో స్థానం కోల్పోయిన అంత‌ర్జాతీయ క్రికెట్ల‌ర్లు సైతం ఈ లీగ్‌లో రాణించి మ‌ళ్లీ జాతీయ జ‌ట్టు త‌లుపు త‌ట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుక‌నే ఈ లీగ్‌లో ఆడాల‌ని యువ క్రికెట‌ర్ల‌తో పాటు అంత‌ర్జాతీయ ఆట‌గాళ్లు సైతం బావిస్తుంటారు.

యువ క్రికెట‌ర్ల‌తో పోలిస్తే అంత‌ర్జాతీయ క్రికెట్‌తో స‌త్తా చాటిన ఆట‌గాళ్ల‌కు తుది జ‌ట్టులో ఎక్కువ‌గా స్థానం క‌ల్పిస్తుంటాయి ప్రాంచైజీలు. అయితే.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 45 శ‌త‌కాలు చేసినా, ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీతో పోటీ ప‌డినా ఓ క్రికెట‌ర్‌ మాత్రం అరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్నాడు. అత‌డు మ‌రెవ‌రో కాదు ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు జోరూట్‌(Joe Root).

32 ఏళ్ల ఈ ఆట‌గాడిని వేలంలో కోటి రూపాయ‌ల‌కు సొంతం చేసుకుంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌. ఇప్ప‌టి వ‌ర‌కు రాయ‌ల్స్ 9 మ్యాచ్‌లు ఆడిన‌ప్ప‌టికి తుది జ‌ట్టులో జో రూట్‌కు స్థానం ద‌క్క‌లేదు. మ‌రో ఐదు మ్యాచ్‌లు రాజ‌స్థాన్ ఆడాల్సి ఉండ‌గా జోస్ బట్లర్, షిమ్రోన్ హెట్మేయర్, ట్రెంట్ బౌల్ట్, జాసన్ హెల్డర్, ఆడమ్ జంపాల‌ను కాద‌ని రూట్ తుది జ‌ట్టులో ఉండ‌డం అనుమాన‌మే.

Virat Kohli: గంభీర్‌తో గొడ‌వ.. మ‌రుస‌టి రోజు భార్య‌తో క‌లిసి విరాట్ ఏం చేశాడంటే..?

టెస్టు ఆట‌గాడిగా ముద్ర ప‌డ‌డ‌మేనా..?

ఐపీఎల్‌లో జో రూట్ అరంగ్రేటం చేయ‌డం దాదాపు అసాధ్యంగానే క‌నిపిస్తోంది. అత‌డు టెస్టు ఆట‌గాడిగా ముద్ర ప‌డ‌డమే అందుకు కార‌ణం. ఇంగ్లాండ్ జ‌ట్టు త‌రుపున 129 టెస్టులు ఆడిన రూట్ 29 సెంచ‌రీలు, 57 అర్ధ‌శ‌త‌కాల సాయంతో 10,948 ప‌రుగులు చేశాడు. 158 వ‌న్డే మ్యాచుల్లో 16 శ‌త‌కాలు, 36 అర్ధ‌శ‌త‌కాల‌తో 6,027 ప‌రుగులు, 32 టీ20 మ్యాచుల్లో 893 ప‌రుగులు చేశాడు. టీ 20ల్లో అత‌డి అత్య‌ధిక స్కోరు 90 ప‌రుగులు.

టీ20ల్లో దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. కాగా రూట్ మాత్రం దూకుడుగా ఆడ‌లేక‌పోవ‌డంతోనే తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌డం లేద‌ని ప‌లువురు క్రికెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ సీజ‌న్‌లో అత‌డు అరంగ్రేటం చేయ‌క‌పోవ‌చ్చున‌ని అంటున్నారు.

IPL 2023, SRH vs KKR: ఇటు హైద‌రాబాద్‌ అటు కోల్‌క‌తా.. రెండింటికి డూ ఆర్ డై.. వ‌రుణుడు ఏం చేస్తాడో..?

మెగా వేలంలో త‌న‌ను రాజ‌స్థాన్ కొనుగోలు చేసిన త‌రువాత రూట్ మాట్లాడుతూ ఐపీఎల్‌లో ఆడ‌డం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు చెప్పాడు. తుది జ‌ట్టులో అవ‌కాశం వ‌చ్చినా రాకున్నా సీజ‌న్ మొత్తానికి అందుబాటులో ఉంటాన‌ని తెలిపాడు. ఈ ఏడాది వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో భార‌త్‌లో పిచ్‌ల‌పై అవ‌గాహ‌న పెంచుకునేందుకు ఐపీఎల్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని రూట్ అన్నాడు.