Jos Buttler score 65 runs in the powerplay against South Africa in a T20I match
Jos Buttler : ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా జట్టు పై పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అతడు ఈ ఘనత అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో బట్లర్ (Jos Buttler) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 83 పరుగులు సాధించాడు. ఇందులో పవర్ ప్లేలోనే అతడు 65 పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికా జట్టు పై పవర్ ప్లేలో 65 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
ఇక ఓవరాల్‌గా పవర్ ప్లే అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. అతడి కంటే ముందు ట్రావిస్ హెడ్ (73), పాల్ స్టిర్లింగ్ (67), కాలిన్ మున్రో (66) లు ఉన్నారు.
* ట్రావిస్ హెడ్ – 73 పరుగులు (2024లో స్కాట్లాండ్ పై)
* పాల్ స్టిర్లింగ్ – 67 పరుగులు (2020లో వెస్టిండీస్ పై)
* కొలిన్ మున్రో – 66 పరుగులు (2018లో వెస్టిండీస్ పై)
* జోస్ బట్లర్ – 65 పరుగులు (2025లో దక్షిణాప్రికా పై)
బట్లర్‌తో పాటు ఫిల్ సాల్ట్ (141 నాటౌట్; 60 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సర్లు) పెను విధ్వంసం సృష్టించడంతో ఇంగ్లాండ్ పవర్ ప్లేలో 100 పరుగులు చేసింది. ఆ తరువాత కూడా వీరిద్దరు దంచికొట్టారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 47 బంతుల్లోనే 126 పరుగులు జోడించారు. జాకబ్ బెథెల్ (26; 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (41 నాటౌట్; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)లు వేగంగా ఆడడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో బ్జోర్న్ ఫోర్టుయిన్ రెండు వికెట్లు తీశాడు.
అనంతరం 305 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 16.1 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్ 146 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సఫారీ బ్యాటర్లలో కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ (41; 20 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), బ్జోర్న్ ఫోర్టుయిన్ (32; 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీశాడు. సామ్ కర్రాన్, లియామ్ డాసన్, విల్ జాక్స్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.