కడపలో 10 వికెట్లతో ‘కేశ్వీ’ వరల్డ్ రికార్డు!

  • Publish Date - February 26, 2020 / 07:38 AM IST

బీసీసీఐ అండర్-19 అంతర్రాష్ట్ర మహిళల క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది చండీగఢ్ బౌలర్ కేశ్వీ గౌతమ్. కడప కేఎస్ఆర్ఎం మైదానం వేదికగా చండీగఢ్-అరుణాచల్ ప్రదేశ్ మధ్య జరిగిన వన్డేలో చండీగఢ్ బౌలర్ కేశ్వీ గౌతమ్ 10 వికెట్లు తీసింది. తద్వారా కేశ్వీ ఒక మ్యాచ్ లో ఎక్కువగా వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించింది. వన్డే మ్యాచ్‌లో కేశ్వీ 4.5 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 10 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. దీంతో కేశ్వీ వరల్డ్ రికార్డు నమోదు చేసింది. 10 వికెట్లలో హ్యాట్రిక్ కూడా కావడం విశేషం. 

ఒక మాములూ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కేశ్వీ.. క్రికెట్ పై మక్కవగాతో ఏడోతరగతి నుంచే క్రికెట్ ఆడటం ప్రారంభించింది. ప్రస్తుతం చండీగఢ్‌లోని ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. మొదట టాస్ గెలిచిన చండీగఢ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసింది. బౌలింగ్ లో ప్రతిభ చాటినా కేశ్వీ.. బ్యాటింగ్‌లోనూ తన సత్తా చాటింది.

ఈ మ్యాచ్‌లో అత్యధికంగా 49 పరుగులతో జట్టును ఆదుకుంది. బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ జట్టు కేశ్వీ దూకుడు ముందు 8.5 ఓవర్లలోనే తేలిపోయింది. జట్టు అలౌట్ కావడంతో పరాజయం పాలైంది. 10 వికెట్లు తీసి ప్రపంచ రికార్డును నెలకొల్పిన కేశ్వీని అభినందిస్తూ బీసీసీఐ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో ఒఖ వీడియోను పోస్ట్ చేసింది. కేశ్వీని అరుదైన ఘనతను అందరూ ప్రశంసిస్తున్నారు.