Virat Kohli : ఛాంపియన్స్ ట్రోఫీ.. కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డ్.. ఇప్పుడు మిస్సైతే ఇక జన్మలో..

kohli
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇక యావత్తు క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న ప్రారంభం కానుంది. ప్రస్తుతం అందరి దృష్టి టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై పడింది. ఈ పరుగుల యంత్రం ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో తన ఫామ్‌ను కొనసాగిస్తాడని అంతా భావిస్తున్నారు. కోహ్లీకి ఇది నాలుగో ఛాంపియన్స్ ట్రోఫీ. ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ 13 మ్యాచ్‌లు ఆడాడు 529 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత ఆటగాడిగా కొనసాగుతున్నారు. అయితే.. అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచేందుకు కోహ్లీకి మరో 173 పరుగులు అవసరం.
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధావన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2013, 2017లలో ఆడిన ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ 10 మ్యాచ్‌ల్లో 701 పరుగులు సాధించాడు. 2013లో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంలో శిఖర్ కీలక పాత్ర పోషించాడు. ఇక 2017లో భారత్ పైనల్ చేరుకున్నప్పటికి పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. కాగా.. ఈ రెండు ఛాంపియన్స్ ట్రోఫీలలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధావన్ నిలిచాడు.
ఇక ధావన్ తరువాత టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రెండో స్థానంలో ఉన్నాడు. 13 మ్యాచ్‌లు ఆడిన గంగూలీ 665 పరుగులు సాధించాడు. ఇక టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మూడో స్థానంలో ఉన్నాడు. 19 మ్యాచ్‌లు ఆడిన ద్రవిడ్ 627 పరుగులు చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు..
శిఖర్ ధావన్ – 701
సౌరవ్ గంగూలీ – 665
రాహుల్ ద్రవిడ్ – 627
విరాట్ కోహ్లీ – 529
ఇక ఓవరాల్‌గా తీసుకుంటే.. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్‌గేల్ పేరిట ఉంది. గేల్ 791 పరుగులు చేశాడు. గేల్ రికార్డును బ్రేక్ చేయాలంటే కోహ్లీ మరో 263 పరుగులు అవసరం. కాగా.. కోహ్లీకి దాదాపుగా ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ అయ్యే అవకాశం ఉంది. మరో ఛాంపియన్స్ ట్రోఫీ అంటే 2029లో జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు కోహ్లీ క్రికెట్‌లో కొనసాగడం కాస్త కష్టమే.