IPL 2020 : కోల్ కతా (KKR) చేతిలో రాయల్ (RR) చిత్తు

  • Publish Date - October 1, 2020 / 05:52 AM IST

IPL 2020 : ఐపీఎల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీ20 మ్యాచ్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. గత మ్యాచ్ లో కొండంత లక్ష్యాన్ని చేధించి రికార్డు బద్దలు కొట్టిన..రాజస్థాన్ ఈసారి బ్యాట్లేత్తిసింది. బొక్కా బొర్లా పడింది. కనీసం పోరాటం చేయలేక స్మిత్ సేన పరాభవం పాలైంది. తొలి మ్యాచ్ లో ఓడిన నైట్ రైడర్స్ కు ఇది వరుసగా రెండో విజయం.



ఐపీఎల్ (IPL 2020) ‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) మరోసారి విజృంభించింది. రాజస్థాన్ రాయల్స్‌ను (RR) 37 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో టోర్నీలో కోల్‌కతా టీమ్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్లను కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. నైట్‌రైడర్స్ చేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి.. రాయల్స్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ పెవిలియన్కు క్యూ కట్టింది.



రాజస్థాన్ బ్యాటింగ్ లో (RR) ఉన్న కీలక ఆటగాళ్లు బట్లర్ 21, కెప్టెన్ స్మిత్ 3, సంజూ సామ్ సన్ 8, ఊతప్ప 2 పరుగులకే పరిమితమయ్యారు. దీంతో అప్పటికే 41 పరుగులకే నాలుగు కీలకమైన వికెట్లను కోల్పోయి రాజస్థాన్ టీమ్ కష్టాల్లో కూరుకుపోయింది. రాయల్స్ జట్టులో టామ్ కుర్రాన్ 54, బట్లర్ 21 పరుగులు చేసి టాప్ స్కోర్లుగా నిలిచారు. నైట్ రైడర్స్ బౌలింగ్లో శివం మావి, కమలేశ్, చక్రవర్తికి తలా రెండు వికెట్లు దక్కగా… కమ్మిన్స్‌, నరేన్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.



అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 47, మోర్గాన్ 34 (నాటౌట్), రస్సెల్ 24, నితీష్ రానా 22 పరుగులు చేశారు. రాయల్స్ బౌలింగ్ లో అర్చర్ రెండు వికెట్లు తీయగా.. రాజ్‌పుత్, ఉనద్కత్, టామ్ కుర్రాన్, రాహుల్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.