×
Ad

Abhishek Nayar: కోల్‌కతా నైట్ రైడర్స్ కొత్త హెడ్ కోచ్ ఇతడే..!

కేకేఆర్ కు బ్యాటింగ్ కోచ్‌గా పని చేసిన సమయంలో ఆటగాళ్ల ఫామ్‌పై దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించాడు.

Abhishek Nayar: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు కొత్త హెడ్ కోచ్‌ రానున్నాడు. కేకేఆర్ నూతన హెడ్ కోచ్ గా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్‌ పేరు వినిపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ రాబోయే సీజన్ కోసం అభిషేక్ నాయర్‌ను తమ ప్రధాన కోచ్‌గా నియమించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఫ్రాంచైజ్ నిర్ణయం గురించి నాయర్‌కు గత వారం చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారత క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు నాయర్. ఆ తర్వాత గత సంవత్సరం ఐపీఎల్ ఫ్రాంచైజీలో సహాయక సిబ్బందిగా చేరాడు.

గత ఐపీఎల్‌లో కేకేఆర్ ప్రదర్శన చాలా ఘోరంగా ఉంది. దాంతో ప్రధాన కోచ్‌ పై వేటు పడింది. చంద్రకాంత్ పండిత్‌ను కేకేఆర్‌ తప్పించింది. అతడి స్థానంలో అభిషేక్ నాయర్‌కు ప్రధాన కోచ్ గా ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఈ మాజీ ముంబై ఆల్ రౌండర్ గతంలో KKR కోసం పనిచేశాడు. అకాడమీలో ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో కీ రోల్ ప్లే చేశాడు. ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ ను తొలగించిన సమయంలో కోల్‌కతా జట్టు నాయర్ ప్రస్తావించింది. 2025 సీజన్ లో KKR ప్రదర్శన దారుణంగా ఉంది. ప్లే-ఆఫ్‌లకు అర్హత సాధించలేకపోయింది. 14 లీగ్ మ్యాచ్‌లలో కేవలం ఐదింటిలో మాత్రమే గెలవగలిగారు.

42ఏళ్ల నాయర్ చాలా సంవత్సరాలుగా ఫ్రాంచైజీకి పనిచేస్తున్నాడు. హెడ్ కోచ్‌గా అతడి పేరు వినిపించడం ఆశ్చర్యం కలిగించలేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో, నాయర్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఫ్రాంచైజ్ UP వారియర్స్ కు హెడ్ కోచ్ గా వ్యవహరించాడు.

కేకేఆర్ కు బ్యాటింగ్ కోచ్‌గా పని చేసిన సమయంలో ఆటగాళ్ల ఫామ్‌పై దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించాడు నాయర్. ఇక ప్లేయర్ల ఫిట్‌నెస్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ రోహిత్ శర్మ. అభిషేక్ నాయర్ పర్యవేక్షణలోనే రోహిత్ స్లిమ్ గా మారాడు.

ఆటగాళ్ల నుండి అద్భుతమైన ప్రదర్శనలు పొందే సామర్థ్యానికి పేరుగాంచిన నాయర్ ఇటీవల తన పాత స్నేహితుడు రోహిత్ శర్మతో కలిసి పని చేస్తున్నాడు. రోహిత్ తన శరీరాన్ని మార్చుకోవడానికి సాయం చేశాడు. నాయర్ పర్యవేక్షణలో రోహిత్ 10 కేజీలకుపైగా బరువు తగ్గాడు. గతంలో చాలా మంది ఆటగాళ్లు తమ ఆటను మార్చుకోవడానికి నాయర్ సాయం చేశాడు. వారిలో కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు.