Kuldeep Yadav achieves bowling feat in T20s for India after 4 wickets against UAE
Kuldeep Yadav : టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో విదేశాల్లో 50 వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా కుల్దీప్ (Kuldeep Yadav) ఈ ఘనత అందుకున్నాడు.
అంతేకాదండోయ్ విదేశాల్లో టీమ్ఇండియా తరుపున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతడు టీమ్ ఇండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ను అధిగమించాడు. అశ్విన్ 44 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 25 ఇన్నింగ్స్‌ల్లో 52 వికెట్లు సాధించాడు.
ఇక ఈ జాబితాలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 45 ఇన్నింగ్స్‌ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. ఆ తరువాత హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లు ఉన్నారు.
విదేశాల్లో భారత్ తరుపున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* అర్ష్‌దీప్ సింగ్ – 45 ఇన్నింగ్స్‌ల్లో 71 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 59 ఇన్నింగ్స్‌ల్లో 63 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా – 42 ఇన్నింగ్స్‌ల్లో 62 వికెట్లు
* భువనేశ్వర్ కుమార్ – 53 ఇన్నింగ్స్‌ల్లో 56 వికెట్లు
* కుల్దీప్ యాదవ్ – 25 ఇన్నింగ్స్‌ల్లో 52 వికెట్లు
* రవిచంద్రన్ అశ్విన్ – 44 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు
ఇక భారత్, యూఏఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్లు అలిషన్ షరాఫు (22), మహ్మద్ వసీమ్ (19) లు ఫర్వాలేదనిపించగా.. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కూడా దాటలేదు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా, శివమ్ దూబె మూడు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, అక్షర్, వరుణ్ చక్రవర్తిలు తలా ఓ వికెట్ సాధించారు.
ఆతరువాత అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30 పరుగులు), శుభ్‌మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (7 నాటౌట్ 2 బంతుల్లో ) వేగంగా ఆడడంతో 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి అందుకుంది.