Kuldeep Yadav Becomes Indias Highest WicketTaker In asia cup history
Kuldeep Yadav : టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియాకప్ చరిత్రలో భారత్ తరుపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా కుల్దీప్ ఈ ఘనత అందుకున్నాడు.
గతంలో ఈ రికార్డు రవీంద్ర జడేజా పేరిట ఉండేది. జడేజా 29 వికెట్లు తీయగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌తో కలిపి కుల్దీప్ (Kuldeep Yadav) 31 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్‌గా ఆసియాకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అతడి కంటే ముందు శ్రీలంక దిగ్గజ ఆటగాడు లసిత్ మలింగ ఉన్నాడు. మలింగ 33 వికెట్లు తీశాడు.
Abhishek Sharma : బంగ్లాదేశ్‌ను చితక్కొట్టడానికి కారణం అదే.. అభిషేక్ శర్మ కామెంట్స్..
ఆసియాకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే..
* కుల్దీప్ యాదవ్ – 31 వికెట్లు
* రవీంద్ర జడేజా – 29 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా – 23 వికెట్లు
* ఇర్ఫాన్ పఠాన్ – 22 వికెట్లు
* భువనేశ్వర్ కుమార్ – 22 వికెట్లు
ఆసియాకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* లసిత్ మలింగ (శ్రీలంక) – 33 వికెట్లు
* కుల్దీప్ యాదవ్ (భారత్) – 31 వికెట్లు
* ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 30 వికెట్లు
* రవీంద్ర జడేజా (భారత్)- 29 వికెట్లు
* షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 28 వికెట్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అభిషేక్ శర్మ (75) మెరుపులకు తోడు హార్దిక్ పాండ్యా (38), శుభ్‌మన్ గిల్ (29) లు రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో రిషద్ హుస్సేన్ రెండు వికెట్లు తీయగా.. తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్, సైఫుద్దీన్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Jaker Ali : అందుకే భారత్ పై ఓడిపోయాం.. లేదంటేనా.. బంగ్లాదేశ్ కెప్టెన్ జాకీర్ అలీ కామెంట్స్..
అనంతరం సైఫ్ హసన్ (69; 51 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించినప్పటికి కూడా మిగిలిన వారు విఫలం కావడంతో బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్‌ప్రీత్ బుమ్రా, వరున్ చక్రవర్తిలు చెరో రెండు వికెట్లు సాధించారు. అక్షర్ పటేల్, తిలక్ వర్మలు చెరో వికెట్ పడగొట్టారు.