Kuldeep Yadav creates history Most wickets in a T20 Asia Cup edition
Kuldeep Yadav : టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియాకప్ టీ20 చరిత్రలో ఓ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో చరిత్ అసలంకను ఔట్ చేయడం ద్వారా కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు యూఏఈ బౌలర్ అమ్జాద్ జావేద్ ను అధిగమించాడు.
అమ్జాద్ జావేద్ 2016లో 7 ఇన్నింగ్స్‌ల్లో 12 వికెట్లు తీయగా.. కుల్దీప్ 6 ఇన్నింగ్స్‌ల్లోనే 13 వికెట్లు సాధించాడు. ఈ జాబితాలో వీరిద్దరి తరువాత అల్-అమీన్ హొస్సేన్, మహ్మద్ నవీద్, భువనేశ్వర్ కుమార్ లు ఉన్నారు.
ఆసియాకప్ టీ20 చరిత్రలో ఓ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* కుల్దీప్ యాదవ్ (భారత్) – 6 ఇన్నింగ్స్‌ల్లో 13 వికెట్లు (2025లో)
* అమ్జాద్ జావేద్ (యూఏఈ) – 7 ఇన్నింగ్స్‌ల్లో 12 వికెట్లు (2016లో)
* అల్-అమీన్ హొస్సేన్ (బంగ్లాదేశ్) – 5 ఇన్నింగ్స్‌ల్లో 11 వికెట్లు (2016లో)
* మహ్మద్ నవీద్ (యూఏఈ) – 7 ఇన్నింగ్స్‌ల్లో 11 వికెట్లు (2016లో)
* భువనేశ్వర్ కుమార్ (భారత్) – 5 ఇన్నింగ్స్‌ల్లో 11 వికెట్లు (2022లో)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61 పరుగులు), తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్) లు దంచికొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. లంక బౌలర్లలో తీక్షణ, చమీర, హసరంగ, శనక, అసలంక లు తలా ఓ వికెట్ తీశారు.
ఆ తరువాత పాతుమ్ నిస్సాంక (58 బంతుల్లో 107 పరుగులు) సెంచరీ చేయగా, కుశాల్ పెరీరా (32 బంతుల్లో 58) అర్థశతకంతో రాణించడంతో లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సరిగ్గా 202 పరుగులే చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు తలా ఓ వికెట్ సాధించారు.
Asia cup 2025 : హరిస్ రవూఫ్, సూర్యకుమార్ యాదవ్‌లకు షాకిచ్చిన ఐసీసీ.. 30 శాతం జరిమానా.. ఇంకా..
ఇరు జట్లు సమాన స్కోరు సాధించడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు 5 బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 2 పరుగులు మాత్రమే చేసింది. 3 పరుగుల లక్ష్యాన్ని భారత్ తొలి బంతికే అందుకుంది.