Asia cup 2025 : హరిస్ రవూఫ్, సూర్యకుమార్ యాదవ్‌లకు షాకిచ్చిన ఐసీసీ.. 30 శాతం జరిమానా.. ఇంకా..
సూర్యకుమార్ యాదవ్‌తో పాటు పాకిస్తాన్ స్టార్ పేసర్ హరిస్ రవూఫ్ పై ఐసీసీ చర్యలు తీసుకుంది.

Suryakumar Yadav Haris Rauf fined 30 % of match fee
Asia cup 2025 : భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు పాకిస్తాన్ స్టార్ పేసర్ హరిస్ రవూఫ్ పై ఐసీసీ చర్యలు తీసుకుంది. వీరిద్దరూ కూడా ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించారని తెలిపింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మ్యాచ్ ఫీజుల్లో చెరో 30 శాతం చొప్పున జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది.
అసలేం జరిగిందంటే..?
ఆసియాకప్ 2025లో (Asia cup 2025) భాగంగా గ్రూప్ స్టేజీలో సెప్టెంబర్ 14న భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయాన్ని టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు, భారత సైనికులకు అంకితం ఇచ్చాడు. సూర్య చేసిన ఈ కామెంట్స్ రాజకీయ కామెంట్స్ అని ఇవి ఐసీసీ రూల్స్‌కు విరుద్దం అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
Abhishek Sharma : శ్రీలంక పై తుఫాన్ ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ..
దీనిపై ఐసీసీ విచారణ జరిపింది. రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఎదుట హాజరైన సూర్యకుమార్ యాదవ్ తాను ఎలాంటి తప్పు చేయలేదన్నాడు. ఈ వివరణపై సంతృప్తి చెందని రిఫరీ.. అతడిని హెచ్చరిస్తూ మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాగా విధించారు. ఇక దీనిపై బీసీసీఐ అప్పీల్ చేసినట్లుగా సమాచారం.
హరిస్ రవూఫ్ ఇలా..
ఇక ఇదే టోర్నీలో సూపర్-4లో భాగంగా భారత్, పాక్ జట్లు సెప్టెంబర్ 21న తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సమయంలో 6 జెట్ విమానాలు కూల్చినట్లుగా సైగలు చేశాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో తాము భారత్‌కు చెందిన 6 యుద్ధ విమానాలను కూల్చినట్లు పాక్ ప్రభుత్వం ప్రగల్భాలు పలికిన సంగతి తెలిసిందే. హరిస్ చేసిన సైగలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేయగా.. విచారణకు హాజరైన రవూఫ్.. తాను భారత్‌ను ఉద్దేశించి ఆ సైగలు చేయలేదని చెప్పాడట. మైదానంలో అతడి వ్యవహార శైలిని మందలించిన ఐసీసీ అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం ఫైన్ వేసింది.
ఫర్హాన్‌కు హెచ్చరిక!
సూపర్-4 మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించిన తరువాత పాక్ ఆటగాడు సాహిబ్‌జాదా ఫర్హాన్ తన బ్యాట్‌తో గన్ షాట్స్ సంబరాలు చేసుకున్నాడు. దీనిపై ఐసీసీ పర్హాన్ హెచ్చరించింది. మరోసారి ఇలా చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది.