Morne Morkel : హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మల గాయాలపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్.. పాక్‌తో ఆడడం కష్టమేనా?
అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యాల గాయాలపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ (Morne Morkel ) అప్‌డేట్ ఇచ్చారు.

Morne Morkel gave a major update on Hardik and Abhishek's availability for the final against Pakistan
Morne Morkel : ఆసియాకప్ 2025 సూపర్-4లో భాగంగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యాలు ఇబ్బందులు పడ్డారు. బ్యాటింగ్‌లో శ్రీలంక పై సూపర్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ ఆ తరువాత ఫీల్డింగ్‌కు రాలేదు. మరోవైపు భారత ఫీల్డింగ్ అప్పుడు ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను వేసిన హార్దిక్ పాండ్యా ఆ వెంటనే మైదానం వీడాడు. దీంతో వీరిద్దరికి ఏమైందోనని అభిమానులు కంగారు పడుతున్నారు.
వీరిద్దరు గాయపడ్డారని, పాక్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడడం కష్టమేనన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరి గాయాల పై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ (Morne Morkel) అప్‌డేట్ ఇచ్చాడు. దుబాయ్‌లోని వాతావరణం వల్ల హార్దిక్ పాండ్యా ఇబ్బంది పడినట్లుగా చెప్పాడు. అతడి కండరాలు పట్టేయడంతోనే మరో ఓవర్ వేయలేదన్నాడు. ఇక అభిషేక్ శర్మ సైతం క్రాంప్స్‌లో బాధపడుతున్నట్లుగా వెల్లడించాడు.
అయితే.. వీరిద్దరికి కూడా పెద్దగా గాయాల సమస్య ఏమీ లేదన్నాడు. కేవలం కండరాలు పట్టేయడంతోనే ఇబ్బంది పడినట్లుగా తెలిపాడు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని, శనివారం వారి ఫిట్‌నెస్ పై ఓ అంచనాకు వస్తామని తెలిపాడు.
ఇక ఫైనల్ మ్యాచ్ ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. దీంతో ప్రత్యేకంగా ట్రైనింగ్ సెషన్ అంటూ ఏమీ ఉండదన్నాడు. ఆటగాళ్లకు మసాజ్ సెషన్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు. వారంతా రిలాక్స్ కావాల్సిన అవసరం ఎంతనా ఉందన్నాడు. భారత ఆటగాళ్ల కంటే పాక్ ప్లేయర్లకు అదనంగా మరో రోజు విశ్రాంతి లభించిందన్నాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా ప్లేయర్లు మరీ ఎక్కువగా సాధన చేస్తే మ్యాచ్ పై ప్రభావం పడే అవకాశం ఉందన్నాడు.
Asia Cup 2025 : భారత్, పాక్ ఫైనల్ కోసం బంగ్లాదేశ్ కి అన్యాయం?.. రెండు నెలల ముందే ఫిక్స్..!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన 202 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61 పరుగులు), తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39 పరుగులు) రాణించారు. ఆ తరువాత పాతుమ్ నిస్సాంక (58 బంతుల్లో 107 పరుగులు) కుశాల్ పెరీరా (32 బంతుల్లో 58) దంచికొట్టడంతో లక్ష్య ఛేదనలో లంక జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సరిగ్గా 202 పరుగులే చేసింది.
దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు 5 బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 2 పరుగులు చేసింది. భారత జట్టు తొలి బంతికే మూడు పరుగులు చేసి గెలుపొందింది.