Charith Asalanka : అందుకే సూపర్ ఓవర్‌లో ఓడిపోయాం.. లేదంటేనా.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక కామెంట్స్
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓడిపోవడం పై లంక కెప్టెన్ చరిత్ అసలంక (Charith Asalanka) స్పందించాడు.

Charith Asalanka comments after srilanka lost match in super over against India in asia cup 2025
Charith Asalanka : ఆసియాకప్ 2025ను ఓటమితో ముగించింది శ్రీలంక. శుక్రవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన లంక జట్టు అభిమానుల మనసులను గెలుచుకుంది. తమ జట్టు ఓటమికి వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌ల అద్భుతమైన బౌలింగ్ కారణమని లంక కెప్టెన్ చరిత్ అసలంక తెలిపాడు.
మ్యాచ్ అనంతరం చరిత్ మాట్లాడుతూ.. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక పై ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్‌లో గెలవలేకపోయినప్పటికి కూడా నిస్సాంక తన అద్భుత బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నాడని చెప్పుకొచ్చాడు. ‘ఇదో అద్భుతమైన గేమ్. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ లు మిడిల్ ఓవర్లలో చాలా చక్కగా బౌలింగ్ చేశారు. వారు బౌలింగ్‌కు రాక ముందు వరకు మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. టీమ్ఇండియాకు సీనియర్ బౌలర్లు ఉన్నారు. ఇక నిస్సాంక దూకుడిగా ఆడిన విధానం అద్భుతం.’ అని అన్నాడు.
ఇక సూపర్ ఓవర్‌లో వీలైననీ ఎక్కువ పరుగులు చేయాలని బ్యాటర్లకు చెప్పానని.. అయితే అలా జరగలేదన్నాడు. ఆసియాకప్‌లో తాము ఫైనల్‌కు చేరుకోలేకపోయామని, అయినప్పటికి ఈ టోర్నీ నుంచి తమకు కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయని తెలిపాడు. తాము మంచి క్రికెట్ ఆడుతున్నామని చెప్పుకొచ్చాడు. దురదృష్టవశాత్తు చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించలేకపోయామన్నాడు. ఓ కెప్టెన్‌గా ఈ టోర్నీ నుంచి తీసుకోవడానికి ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయని చరిత్ తెలిపాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (61; 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (49 నాటౌట్; 34 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), సంజూ శాంసన్ (39; 23 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) లు రాణించారు.
IND vs PAK : 41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలోనే తొలిసారి ఇలా.. ఇప్పుడు ఏం జరుగుతుందో మరీ..
ఆ తరువాత పాతుమ్ నిస్సాంక (107; 58 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగాడు. అతడితో పాటు కుశాల్ పెరీరా (58; 32 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో లక్ష్య ఛేదనలో లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
సూపర్ ఓవర్ ఇలా..
టీమ్ఇండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సూపర్ ఓవర్ ను వేశాడు. లంక జట్టు 5 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి కేవలం 2 పరుగులే చేసింది. 3 పరుగుల లక్ష్యాన్ని భారత్ తొలి బంతికే చేసి విజయాన్ని అందుకుంది.