Asia Cup 2025 : భారత్, పాక్ ఫైనల్ కోసం బంగ్లాదేశ్ కి అన్యాయం?.. రెండు నెలల ముందే ఫిక్స్..!
ఆసియాకప్ 2025 లో (Asia Cup 2025) బంగ్లాదేశ్ వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది.

Bangladesh forced to play match back to back days in Asia Cup 2025
Asia Cup 2025 : ఆసియాకప్ 2025లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించి పాకిస్తాన్ ఫైనల్ చేరుకుంది. గురువారం సూపర్-4లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఆదివారం (సెప్టెంబర్ 28న) దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాక్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో భారత్, పాక్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుండడం ఇదే తొలిసారి. అంతేకాదు.. ఓ ఎడిషన్‌లో మూడు సార్లు భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ లు జరగడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆసియాకప్ 2025లో గ్రూప్ స్టేజీలో ఒకసారి, సూపర్-4 స్టేజీలో మరోసారి భారత్, పాక్‌లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలుపొందింది.
బంగ్లాదేశ్‌కు అన్యాయం..
ఈ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందని అంటున్నారు. సూపర్-4లో స్టేజ్‌లో బంగ్లాదేశ్ జట్టు వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడింది. బుధవారం భారత్‌తో తలడపగా, ఆవెంటనే గురువారం పాకిస్తాన్‌తో ఆడింది. ఈ టోర్నీలో పాల్గొన్న మరే జట్టు కూడా వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడలేదు.
పాక్‌తో మ్యాచ్‌కు కనీసం ఒక్క రోజైన విశ్రాంతి ఉంటే బాగుండేదని బంగ్లా ఫ్యాన్స్ అంటున్నారు. భారత్‌తో మ్యాచ్ ఆడడంతో బంగ్లా ఆటగాళ్లు శారీరకంగా అలసిపోయారని, మరుసటి రోజే పాక్‌తో మ్యాచ్ జరగడంతో తమ పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించలేకపోయారని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఒకరోజు విరామం దొరికి ఉంటే ఫలితం మరొలా ఉండేదని అంటున్నారు. షెడ్యూల్ రూపొందించేటప్పుడే కాస్త అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే ఇలా జరిగేది కాదని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఆసియాకప్ 2025 షెడ్యూల్‌ను రెండు నెలల ముందు అంటే జూలైలోనే విడుదల చేసిన సంగతి తెలిసిందే.