Kuldeep Yadav opens up about marriage rumours
Kuldeep : టీమ్ఇండియా మరోసారి టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచింది. టీమ్ఇండియా ప్రపంచకప్‌ను ముద్దాడడంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన వంతు పాత్ర పోషించాడు. ప్రపంచకప్ సాధించిన తరువాత తొలిసారి స్వస్థలం కాన్పూర్‌లో అడుగుపెట్టిన కుల్దీప్‌కు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. టపాసులు, డోలు చప్పుళ్లు మధ్య అతడిని ఊరేగిస్తూ తీసుకువెళ్లారు. అనంతరం కుల్దీప్ మాట్లాడుతూ ఓ తీపి కబురును చెప్పాడు.
త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నానని అన్నాడు. కాగా.. గత కొంతకాలంగా కుల్దీప్ ఓ బాలీవుడ్ నటితో సన్నిహితంగా ఉంటున్నాడని, ఆమెను పెళ్లి చేసుకుంటాడనే రూమర్లు వచ్చాయి. వీటిపైనా అతడు స్పందించాడు. తాను సినీ రంగానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదన్నాడు.
IND vs ZIM : జింబాబ్వేపై విజయం తరువాత శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు
తనతో పాటు తన కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయి తన జీవితంలోకి రావడం చాలా ముఖ్యమని ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ చెప్పాడు. త్వరలోనే ఆమె ఎవరు అనే విషయాన్ని వెల్లడిస్తానని అన్నాడు.
ఇక ప్రపంచకప్ గెలవడం పై మాట్లాడుతూ.. ఈ క్షణం కోసం ఎంతో కాలంగా ఎదురుచూసామని చెప్పాడు. ప్రపంచకప్‌ను గెలవడంతో చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. టీమ్ఇండియాకు ఈ ప్రపంచకప్ ఎంతో ముఖ్యం. ప్రధాని మోదీని కలవడంతో తన సంతోషం రెట్టింపైందని తెలిపాడు. ఇకపై కూడా టీమ్ఇండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పాడు.
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌లో గ్రూపు దశలోని మ్యాచుల్లో కుల్దీప్ కు ఆడే అవకాశం రాలేదు. సూపర్ -8 నుంచి అతడు తుది జట్టులో ఉన్నాడు. ప్రతీ మ్యాచులో తనదైన ముద్ర వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడ్డాడు. మొత్తంగా 10 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.