Kuldeep Yadav taking Rohit Sharma place in Team Bus
ఇంగ్లాండ్‌తో జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ టెస్టు సిరీస్‌లో ఏకైక స్పిన్నర్‌గా టీమ్ఇండియా జట్టులో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కింది. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్‌లో సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో మైదానం బయట, లోపల ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అతడి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నట్లుగా చెప్పాడు.
టెస్టు క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమ్ బస్సులో రోహిత్ శర్మ సీటు ఖాళీ అయింది. ఇక ఈ సీటును తాను ఆక్రమించినట్లుగా కుల్దీప్ చెప్పాడు. హిట్‌మ్యాన్ స్థానాన్ని ఆక్రమించడం తన ఉద్దేశ్యం కాదనీ, కేవలం జడేజా పక్కన కూర్చోవడం కోసమేనని ఈ పని చేసినట్లుగా తెలిపాడు.
‘ జట్టులో నేను రోహిత్ భాయ్ స్థానాన్ని ఎప్పటికీ తీసుకోలేను. బస్సులో అతడి సీట్లో మాత్రమే కూర్చుకుంటున్నాను. జడ్డూ భాయ్‌తో ఇంకాస్త ఎక్కువ సేపు మాట్లాడేందుకు ఇలా చేస్తున్నాను. అశ్విన్ కూడా ఇప్పుడు జట్టులో లేడు. దీంతో స్పిన్నర్‌గా జడ్డూతో బ్యాటర్లను ఎలా బుట్టలో వేయాలనే విషయాలపై చర్చిస్తున్నాను. అతడి నుంచి ఎంతో నేర్చుకుంటున్నాను.’ అని కుల్దీప్ యాదవ్ అన్నాడు.
ఇక తన కెరీర్‌లో ఆరంభంలో అశ్విన్, జడేజాలు ఇద్దరితో కలిసి ఆడినట్లుగా గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో వారిద్దరు ఎంతో సాయపడినట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జడేజాతో కలిసి స్పిన్ బౌలింగ్ భారాన్ని మోయనుండడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు.
ఇంగ్లాండ్‌లో ఒకే ఒక టెస్టు..
ఇంగ్లాండ్ దేశంలో కుల్దీప్ యాదవ్ ఇప్పటి వరకు ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. 2018లో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది ఓవర్లు వేసి 44 పరుగులు ఇచ్చిన కుల్దీప్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే.. ఇటీవల కాలంలో ప్రమాదకర స్పిన్నర్‌గా మారిన కుల్దీప్ ఈ సిరీస్‌లో ఎలా రాణిస్తాడో చూడాల్సిందే.