IPL 2024 : హాఫ్ సెంచరీలతో డికాక్, రాహుల్ వీరవిహారం.. చెన్నైపై లక్నో విజయదుంధుభి

లక్నో ఓపెనర్ క్వింటన్ డికాక్ (54; 43 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్) హాఫ్ సెంచరీ, కెఎల్ రాహుల్ (82; 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీతో విజృంభించి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించారు.

IPL 2024 : ఐపీఎల్ 2024 సీజన్‌లో  చెన్నై దూకుడుకు లక్నో కళ్లెం వేసింది.  భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. సొంతం మైదానంలో లక్నో ఇంకా 6 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది.

177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (54; 43 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్) హాఫ్ సెంచరీ, మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ (82; 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీతో విజృంభించి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించారు.

మిగతా ఆటగాళ్లలో నికోలస్ పూరన్ (23), స్టోయినెస్ (8) పరుగులతో రాణించగా లక్నో 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 180 పరుగులతో విజయం సాధించింది. చెన్నై బౌలర్లలో రెహమాన్, మతీష్ పతిరన తలో వికెట్ తీసుకున్నారు. లక్నో ఛేదనలో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ (82/53)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

జడేజా హాఫ్ సెంచరీ :
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్ అజింక్య రహానె (36) పరుగులకే పరిమితం కాగా, రవీంద్ర జడేజా (57; 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో విజృంభించాడు. మెయిన్ అలీ (30), రుతురాజ్ గైక్వాడ్ (17) పర్వాలేదనిపించగా.. సమీర్ రజ్వీ (1), రచిన్ రవీంద్ర ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

మ్యాచ్ చివరిలో ఎంఎస్ ధోనీ (28 నాటౌట్) విజృంభించగా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఫలితంగా ప్రత్యర్థి జట్టు లక్నోకు 177 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, మార్కస్ స్టోయినిస్ తలో వికెట్ తీసుకున్నారు.

టాప్ 3లో చెన్నై :
చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 3 ఓడింది. పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో చెన్నై మూడో స్థానంలో నిలిచింది. లక్నో జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 3 ఓడింది. మొత్తం 8 పాయింట్లతో సూపర్ జెయింట్స్ 5వ స్థానంలో నిలిచింది.

Read Also : Sanjay Manjrekar : బ్యాటింగ్ చేసే అవ‌కాశం రావ‌డం లేదు.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చోటివ్వండి?

ట్రెండింగ్ వార్తలు