Lucknow Super Giants
IPL 2023, RR vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌లో భాగంగా సువాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది. దీంతో లక్నో 10 పరుగుల తేడాతో గెలిచింది. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ మూడు వికెట్లు తీయగా, స్టోయినిస్ రెండు వికెట్లు పడగొట్టారు.
ఓ మోస్తారు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(44; 35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్(40; 41 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) లు తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అర్థశతకానికి చేరువైన జైశ్వాల్‌ను స్టోయినిస్ ఔట్ చేయడంతో వికెట్ల పతనం ఆరంభమైంది. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల రాక మందగించింది. ఇదే సమయంలో రాజస్థాన్ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. సంజు శాంసన్(1) రనౌట్ కాగా, కుదరుకున్న బట్లర్‌తో పాటు ఫామ్‌లో హెట్‌మయర్(2) ఔట్ కావడంతో 104 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పడిక్కల్(26), రియాన్ పరాగ్(15 నాటౌట్) లు ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోవడంతో 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
IPL 2023, RR vs LSG: టేబుల్ టాపర్ల మధ్య సమరం.. విజయం సాధించేది ఎవరో..? హెడ్ టూ హెడ్ రికార్డు
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్(39; 32 బంతుల్లో 4 పోర్లు, 1 సిక్స్), కైల్ మేయర్స్(51; 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభారంభం అందించారు. అయితే.. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ధాటిగా ఆడడంలో వీరు విఫలం అయ్యారు. 11 ఓవర్ల పాటు ఓపెనర్లు ఇద్దరు క్రీజులో నిలిచినప్పటికి 82 పరుగులు మాత్రమే చేశారు. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడిని రాహుల్ ను ఔట్ చేయడం ద్వారా జేసన్ హోల్డర్ విడగొట్టాడు.
మరుసటి ఓవర్‌లోనే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఆయుష్ బదోని(1) క్లీన్ బౌల్డ్ కావడంతో 86 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి కైల్ మేయర్స్ 40 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. ఈ దశలో అశ్విన్ మాయ చేశాడు. ఓకే ఓవర్‌లో దీపక్ హుడా(2)తో పాటు కైల్ మేయర్స్‌ను ఔట్ చేశాడు. దీంతో 104 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. మార్కస్ స్టోయినిస్(21; 16బంతుల్లో 2 ఫోర్లు), నికోలస్ పూరన్(28; 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)లు వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకోని ఓ మోస్తారుగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మలు తలా ఓ వికెట్ పడగొట్టారు.