Manoj Tiwary angry on Team India Head coach Gautam Gambhir
IND vs SA : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోయింది. దీంతో టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు వస్తున్నాయి. గంభీర్ నిర్ణయాల వల్లే భారత జట్టు స్వదేశంలోనూ వరుసగా పరాజయాలను చవిచూస్తుందని మాజీ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
తొలి టెస్టు (IND vs SA) ఓటమి అనంతరం గంభీర్ మాట్లాడుతూ.. టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో ఓడిపోవడానికి పిచ్ కారణం కాదన్నాడు. బ్యాటర్లు సరిగ్గా ఆడకపోవడమే అసలు కారణం అని చెప్పుకొచ్చాడు. తమకు కావాల్సిన పిచ్ ఇదేనన్నాడు. కాగా.. గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఆటగాడు మనోజ్ తివారీ విమర్శలు గుప్పించాడు.
స్పిన్ ను సమర్థవంతంగా ఎలా ఎదుర్కొనాలో అనే విషయాన్ని ఆటగాళ్లకు సరైన కోచింగ్ ఇవ్వకపోవడం వల్లే టీమ్ఇండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చిందన్నాడు. ఇక భారత క్రికెట్‌లో పరివర్తన దశ అనే దానికి తావు లేదన్నాడు. అది భారత జట్టుకు అవసరం లేదన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ఎంతో మంది ప్రతిభావంతమైన క్రికెటర్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చాడు.
ఇక సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మరికొంత కాలం టెస్టులు ఆడాలని భావించారని, అయితే.. ఈ అనవసరమైన పరివర్తన అనే చర్చతో వారిపై ఒత్తిడి తీసుకువచ్చారన్నాడు. అందువల్లనే వారు రిటైర్‌మెంట్ ప్రకటించారని తెలిపాడు.
ఇక తొలి టెస్టులో ఓటమికి బ్యాటర్లను బాధ్యులను చేయడం తగదన్నాడు. కోచ్‌గా ఉన్నది వారికి నేర్చించడానికేనని చెప్పుకొచ్చాడు. బ్యాటర్లు సరిగ్గా డిఫెన్స్ ఆడలేదని అంటున్నారని, అంటే మ్యాచ్ ముందు మీరు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదా అని ప్రశ్నించాడు. ఓ బ్యాటర్‌గా గంభీర్ స్పిన్‌ను అద్భుతంగా ఆడతాడు కాబట్టి అతడు కోచ్‌గా మరింత బాగా ఆటగాళ్లకు నేర్పించాలన్నాడు.