Mohammed Shami: షమీ పాపం చేశాడంటూ ఇటీవలే కామెంట్స్‌.. ఇప్పుడు అతడి కూతురు కూడా పాపం చేసిందంటూ..

మార్చి 6న ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో షమీ బాటిల్‌లో నీళ్లు తాగుతూ కనిపించిన తర్వాత రజ్వీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

Mohammed Shami

ఇటీవల ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో టీమిండియా బౌలర్ మహమ్మద్‌ షమీ నీళ్లు తాగడాన్ని ఆలిండియా ముస్లిం జమాత్‌ మౌలానా షాహబుద్దీన్‌ రజ్వీ తప్పుబట్టిన విషయం తెలిసిందే. రంజాన్‌ మాసం వేళ ఉపవాస నియమాన్ని షమీ ఉల్లంఘించాడని, దీంతో షరియత్‌ చట్టం ప్రకారం అతడు నేరస్థుడని అన్నారు. ఇప్పుడు మౌలానా షాహబుద్దీన్‌ రజ్వీ

షమీ కూతురిని తప్పుబట్టారు. ఆ పాప హోలీ ఆడడమే ఇందుకు కారణం. షమీ కూతురు జరుపుకున్న ఈ వేడుక షరియత్‌ చట్టానికి వ్యతిరేకమని చెప్పారు. ఆ పాపను విమర్శిస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

“షమీ కుమార్తెకు తప్పులు తెలుసుకునే తెలివి ఉండి, హోలీ ఆడితే అది ఒక నేరం అవుతుంది. దీన్ని షరియత్‌కు వ్యతిరేకంగా పరిగణించొచ్చు. ఆమె చిన్న పిల్ల. ఏమీ తెలియనితనంతో హోలీ ఆడితే అది నేరం కాదు” అని చెప్పారు.

షరియత్‌కు వ్యతిరేకంగా పిల్లలను ఏదీ చేయనివ్వవద్దని షమీ, అతని కుటుంబ సభ్యులకు చెప్పానని రజ్వీ చెప్పుకొచ్చారు. ముస్లింలు హోలీని జరుపుకోవద్దని అన్నానని వివరించారు. హిందువులకు హోలీ పెద్ద పండుగే అయినప్పటికీ దాన్ని ముస్లింలు జరుపుకోవద్దని అన్నారు. షరియత్ గురించి తెలిసినప్పటికీ హోలీ జరుపుకుంటే అది నేరమేనని తెలిపారు.

Also Read: ఉక్కపోతల మధ్య చల్లని కబురు.. ఆ రెండు రోజులు వర్షాలు.. యాహూ.. 

ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టును రజ్వీ అభినందించారు. “టీమిండియా కెప్టెన్, ఇతర ఆటగాళ్లు, మహమ్మద్ షమీకి నా హృదయపూర్వక అభినందనలు” అని ఆయన అన్నారు.

కాగా, మార్చి 6న ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో షమీ బాటిల్‌లో నీళ్లు తాగుతూ కనిపించిన తర్వాత రజ్వీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

“షరియత్ దృష్టిలో అతను నేరస్థుడు. ఇలా అస్సలు చేయకూడదు” అని అన్నారు. షరియత్ నియమాలను పాటించాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. షరియత్ నియమాలను పాటించడం ముస్లింలందరి బాధ్యత అని, ఇస్లాంలో ఉపవాసం తప్పనిసరి అని తెలిపారు. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఉపవాసం ఉండకపోతే, అతను ఇస్లామిక్ చట్టం ప్రకారం పాపి అని అన్నారు.