టాప్‌లోకి ముంబై.. ఢిల్లీపై ఘన విజయం

  • Publish Date - October 11, 2020 / 11:44 PM IST

MI vs DC IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 27 వ మ్యాచ్‌లో ఢిల్లీపై ముంబై ఇండియన్స్ 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. అబుదాబిలోని మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రాణించగా.. శిఖర్ ధావన్ అర్ధ సెంచరీ సహాయంతో 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.



విజయం కోసం 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 19.4 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంది ముంబై జట్టు. ఐపీఎల్‌లో జరిగిన ఈ సూపర్ సండే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను సులభంగా ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది ముంబై. రోహిత్ శర్మ జట్టు 7 మ్యాచ్‌ల్లో 5మ్యాచ్‌లు గెలిచి 10 పాయింట్లు సాధించింది. ఢిల్లీ కూడా 7 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు సాధించి రెండవ ప్లేస్‌లో ఉంది. అయితే రన్ రేట్‌లో ముంబై ముందుంది.



టాస్ గెలిచిన తరువాత ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోగా.. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా తన మునుపటి ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో 4 పరుగుల వద్ద క్రునాల్ పాండ్యా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో 15 పరుగులు చేసి అజింక్య రహానే కూడా రెండవ వికెట్‌గా అవుట్ అయ్యాడు.



ఐపిఎల్ 2020‌లో రహానేకు ఇది తొలి మ్యాచ్‌ కాగా.. ఆశించిన స్థాయిలో రాణించలేదు. శిఖర్ ధావన్‌తో మంచి భాగస్వామ్యాన్ని పంచుకున్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. మూడవ వికెట్‌గా అవుట్ అయ్యాడు. శిఖర్ ధావన్ 39 బంతుల్లో అర్ధ సెంచరీ కొట్టాడు. 8 బంతుల్లో 13 పరుగులు చేసి రనౌట్ అయిన మార్కస్ స్టోయినిస్.. ఢిల్లీకి నాలుగో వికెట్. ధావన్ 69, అలెక్స్ క్యారీ 14 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అయితే ఢిల్లీ నిర్దేశించిన 163పరుగుల టార్గెట్‌ని 5వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది ముంబై.



ముంబై బౌలర్లు జస్ప్రీత్ బూమ్రా, ట్రెంట్ బోల్ట్ ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. బుమ్రా 4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇవ్వగా, బోల్ట్ 4 ఓవర్లలో 36 పరుగులకు 1 వికెట్ తీసుకున్నాడు. క్రునాల్ పాండ్యా అత్యధికంగా 2 వికెట్లు పడగొట్టాడు. అతను 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చాడు. జేమ్స్ ప్యాటిన్సన్ 3 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చాడు. రాహుల్ చాహర్ 4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కీరోన్ పొలార్డ్ ఒక ఓవర్ వేయగా.. అందులో 10 పరుగులు ఇచ్చాడు.



ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి.. రిషబ్ పంత్ స్థానంలో అలెక్స్ క్యారీని చేర్చారు, కాని విదేశీ ఆటగాడు కావడంతో, షిమ్రాన్ హెట్మీయర్‌ను తొలగించాల్సి వచ్చింది. ఐపిఎల్ 2020లో అజింక్య రహానెకు మొదటి అవకాశం లభించింది.