Australia Team
Australia Player Mitchell Marsh : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023లో ఆస్ట్రేలియా జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ జట్టులోని పలువురు ప్లేయర్స్ గాయాలతో ఇబ్బంది పడుతూ మెగా టోర్నీకి దూరమయ్యారు. తాజాగా ఫామ్ లో ఉన్న ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడు. మార్ష్ వ్యక్తిగత కారణాల వల్ల గురువారం భారతదేశం నుంచి స్వదేశానికి వెళ్తున్నాడు. మిగిలిన ప్రపంచ కప్ లో మ్యాచ్ లకు అతను హాజరయ్యేది ఖచ్చితంగా తెలియదని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది.
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఇప్పటికే గాయపడ్డాడు. గోల్ఫ్ కార్ట్ నుంచి కిందపడటం వల్ల మాక్స్‌వెల్ కంకషన్ కు గురవడంతో పాటు అతని ముఖానికి గాయాలయ్యాయి. దీంతో శనివారం ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు మాక్స్‌వెల్ దూరమయ్యాడు. మాక్స్‌వెల్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు దూరమవుతున్నట్లు తెలిసిన 24గంటల వ్యవధిలోనే మిచెల్ మార్ష్ టోర్నీమొత్తానికి దూరమవుతుండటం ఆ జట్టుకు గట్టిదెబ్బేనని చెప్పొచ్చు. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో మాక్స్‌వెల్, మార్ష్ స్థానంలో జట్టు సభ్యులు అలెక్స్ కారీ, సీన్ అబాట్, మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్ తుదిజట్టులో చేరేందుకు పోటీ పడుతున్నారు. స్పిన్నర్ తన్వీర్ సంఘూ రిజర్వ్ గా జట్టుతో ఉన్నాడు.
మెగాటోర్నీలో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడి నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిది పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆల్-రౌండర్ మార్ష్ ఈ టోర్నమెంట్ లో మొత్తం 225 పరుగులు చేశాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. బెంగళూరులో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు.
ఆస్ట్రేలియా శనివారం (నవంబర్ 4న) ఇంగ్లాండ్ తో తలపడనుంది. నవంబర్ 7న అఫ్గానిస్థాన్ తో, నవంబర్ 11న బంగ్లాదేశ్ జట్టుతో తలపడనుంది. ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న ఆసీస్ జట్టు మూడు మ్యాచ్ లలో రెండింటిలో విజయం సాధించినా సెమీఫైనల్ లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.