Mohammad Kaif compares Abhishek Sharma to Chris Gayle
Abhishek Sharma : వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్‌గేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడు క్రికెట్ ఆడే రోజుల్లో విధ్వంసకర వీరుల్లో ఒకడిగా నిలిచాడు. ఈ మాజీ వెస్టిండీస్ ఆటగాడు 463 టీ20 మ్యాచ్‌ల్లో 36.22 సగటు, 144.75 స్ట్రైక్‌రేటుతో 14,562 పరుగులు సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి రికార్డు అతడి పేరిటే ఉంది. అయితే.. ఈ దిగ్గజ ఆటగాడి కంటే కూడా టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎక్కువ విధ్వంసకర ఆటగాడు అని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తెలిపాడు.
గేల్ క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకుంటాడని, ఆ తరువాత వేగం పెంచుతాడని కైఫ్ అన్నాడు. అయితే.. అభిషేక్ మాత్రం తొలి బంతి నుంచే బాదడం మొదలెడతాడని చెప్పుకొచ్చాడు. ఇలా తొలి బంతి నుంచే దూకుడుగా ఆడే ప్లేయర్లలో చాలా మందికి నిలకడ ఉండదని తెలిపాడు. అయితే.. ఈ విషయంలో అభిషేక్ వారందరికి భిన్నమని అన్నాడు.
కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. ‘సాధారణంగా క్రిస్ గేల్ భారీ షాట్లు ఆడతాడు. అయితే.. అతడు ప్రతి సారీ కూడా వాటి కోసం ప్రయత్నించడు. చాలా స్మార్ట్ క్రికెట్ ఆడుతాడు. అతడు తొలి ఓవర్లను చాలా జాగ్రత్తగా ఆడేవాడు. మొయిన్ ఓవర్లూ ఉండేవి. బెంగళూరు వంటి పిచ్ పై కూడా తొలుత నెమ్మదిగా బ్యాటింగ్ చేసి ఆ తరువాత వేగం పెంచేవాడు.’ అని కైఫ్ అన్నాడు.
ఇక అభిషేక్ ఇందుకు పూర్తి భిన్నం అని చెప్పుకొచ్చాడు.’ అభిషేక్ తొలి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగుతాడు. ఇలాంటి వారిలో సాధారణంగా నిలకడ ఉండదు. ఇందుకు అభిషేక్ మినహాయింపు. అతడు ప్రతి మ్యాచ్‌లో తనను తాను నిరూపించుకుంటాడు. అతడు మ్యాచ్‌లో 12 నుంచి 14 బంతులను ఎదుర్కొన్నప్పటికి కూడా 60 నుంచి 70 పరుగులు చేస్తాడు. అదే అతడిని మ్యాచ్ విన్నర్‌గా నిలబెడుతుంది. అభిషేక్ శర్మ రాణిస్తే టీమ్ఇండియా ఈజీగా మ్యాచ్ గెలుస్తుంది.’ అని కైఫ్ చెప్పాడు.
అభిషేక్ శర్మ ఇప్పటి వరకు భారత్ తరుపున 36 టీ20 మ్యాచ్‌లు ఆడాడు 38.4 సగటు, 195.2 స్ట్రైక్‌రేటుతో 1267 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, ఎనిమిది అర్థశతకాలు ఉన్నాయి.