Monty Panesar suggested Gautam Gambhir should coach a Ranji Trophy team
Gautam Gambhir : టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మార్గ నిర్దేశంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ అదరగొడుతోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియాకప్ 2025 లను సొంతం చేసుకుంది. అయితే.. టెస్టుల విషయానికి వస్తే మాత్రం ఘోర పరాజయాలను చవిచూస్తోంది. గంభీర్ కోచ్ అయ్యాక 10 టెస్టుల్లో భారత్ ఓడిపోయింది. ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో చేతుల్లో ఓడిపోవడంతో గంభీర్ పై విమర్శలు వస్తున్నాయి. టెస్టుల్లో అతడిని తప్పించి మరొకరిని కోచ్‌గా చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెడ్ బాల్ క్రికెట్‌ను బాగా అర్థం చేసుకోవడానికి గౌతమ్ గంభీర్ రంజీ ట్రోఫీ జట్టుకు కోచ్‌గా ఉండాలని సూచించాడు. రంజీ జట్టుతో కలిసి పనిచేయడం వల్ల అతను ఇతర కోచ్‌లతో సంప్రదించి, పొడవైన ఫార్మాట్‌కు జట్టును ఎలా నిర్మించాలో నేర్చుకోవడానికి వీలు కలుగుతుందన్నాడు.
గౌ’తమ్ గంభీర్ వైట్-బాల్ క్రికెట్‌లో మంచి కోచ్. టీమ్ఇండియా సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. అయితే.. రెడ్‌బాల్ క్రికెట్‌లో అతడు జట్టును ఎలా నిర్మించాలి అనే విషయాన్ని రంజీల్లో కోచ్‌గా పని చేసిన వారితో మాట్లాడాలి. ప్రస్తుతం భారత టెస్టు జట్టు చాలా బలహీనంగా ఉంది. ఇదే నిజం. ఒకేసారి ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు రిటైర్ కావడంతో వారి స్థానానలను భర్తీ చేయడం కాస్త కష్టం. జట్టును నిర్మించేందుకు కాస్త సమయం పడుతుంది’. అని పనేసర్ అన్నాడు.
అలాంటిదేమీ లేదు బీసీసీఐ..
ఇటీవల స్వదేశంలో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ వైట్ వాష్‌కు గురైంది. ఈ క్రమంలో గంభీర్ ను తొలగించి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమించాలని బీసీసీఐ భావించినట్లుగా ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పటికే ఈ విషయాన్ని లక్ష్మణ్‌తో చర్చించారని అయితే ఈ ప్రతిపాదనను అతడు సున్నితంగా తిరస్కరించాడని పేర్కొన్నాయి.
Doug Bracwell : క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ బ్రేస్‌వెల్..
ఇక ఈ వార్తల పై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించాడు. అవన్నీ అవాస్తవాలేనన్నాడు. బీసీసీఐ ఎలాంటి చర్చ జరపలేదు. ఎవరో సృష్టించిన కథనాలు మాత్రమే. కాంట్రాక్టు ప్రకారమే గంభీర్ కొనసాగుతాడని చెప్పుకొచ్చాడు.