ధోనీ రిటైర్మెంట్ అంటూ ప్రచారం!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక సందర్భమేమీ లేకపోయినా ధోనీతో కలిసి ఆడిన మ్యాచ్ గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశాడు. దీనిని బలపర్చే విధంగా మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడని రూమర్లు వినిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం 4గంటలకు సమావేశమయ్యేందుకు మీడియాకు పిలుపునిచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

టీమ్ మేనేజ్‌మెంట్‌కు ధోనీ ఇప్పటికే తన నిర్ణయం ప్రకటించేశాడని సమాచారం. 2019సెప్టెంబర్ 12న అధికారికంగా ప్రకటిస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ధోనీ రిటైర్మెంట్ ఇవ్వొద్దని ఆన్‌లైన్ వేదికగా నెటిజన్లు కోరుతున్నారు. మరోవైపు టీమిండియాలో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ పూర్తిగా నిలదొక్కుకోలేదు. ఇటువంటి క్రమంలో జట్టుకు ధోనీ అనుభవం ఎంతగానో అవసరమని అభిమానులు కోరుతున్నారు. 

వరల్డ్ కప్ 2019 సెమీ ఫైనల్ లోనే భారత్ వెనుదిరగడంతో ధోనీ జట్టు నుంచి కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఆర్మీ క్యాంపులోని పారాచ్యూట్ విభాగంలో జులై 22నుంచి ఆగష్టు 15వరకూ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా కాపలా, పాట్రోలింగ్ వంటి పనుల్లో సైనికులతో కలిసి లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించాడు.