WPL 2024 : GG vs MI మ్యాచ్‌లో ఏమి జ‌రిగిందంటే?

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్ ) రెండో సీజ‌న్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది.

WPL 2024 : GG vs MI మ్యాచ్‌లో ఏమి జ‌రిగిందంటే?

GG vs MI

WPL 2024 – GG vs MI : మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్ ) రెండో సీజ‌న్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. ఈ సీజ‌న్‌లో వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఆదివారం గుజ‌రాత్ జెయింట్స్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికైంది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్ మ‌హిళ‌ల జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 126 ప‌రుగులు చేసింది. తనూజ క‌న్వ‌ర్ (28; 21 బంతుల్లో 4 ఫోర్లు), కెప్టెన్ బెత్‌ మూనీ (24; 22 బంతుల్లో 2 ఫోర్లు), క్యాథ్రిన్‌ బ్రిస్ (25 నాటౌట్; 24 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌), ఆష్లీ గార్డనర్ (15; 22 బంతుల్లో 2 ఫోర్లు) ఫ‌ర్వాలేద‌నిపించారు. వీరు మిన‌హా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ స్కోరుకే ప‌రిమితం కావ‌డంతో గుజ‌రాత్ స్వ‌ల్ప స్కోరుకే ప‌రిమితమైంది. ముంబై బౌలర్లు అమెలియా కెర్‌ (4/17), షబ్నమ్‌ (3/18) గుజ‌రాత్‌ను గ‌ట్టి దెబ్బ‌తీశారు.

మైదానంలో స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు వార్నింగ్ ఇచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్

ల‌క్ష్యాన్ని ముంబై 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై త‌డ‌బ‌డి నిల‌బ‌డింది. యాస్తిక భాటియా (7), హేలీ మాథ్యూస్ (7), నాట్ స్కివర్-బ్రంట్ (22; 18 బంతుల్లో 4 ఫోర్లు) త‌క్కువ ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరుకోవ‌డంతో ముంబై 49 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (46 నాటౌట్; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌), అమేలియా కెర్ (31; 25 బంతుల్లో 3 ఫోర్లు)తో క‌లిసి జ‌ట్టును ఆదుకుంది.

ల‌క్ష్యం చిన్న‌దే కావ‌డంతో వీరిద్ద‌రుపై ఎలాంటి ఒత్త‌డి లేక‌పోవ‌డంతో స్వేచ్ఛ‌గా బ్యాటింగ్ చేశారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. విజ‌యానికి చేరువైన క్ర‌మంలో అమేలియా కెర్ తో పాటు పూజా వ‌స్త్రాక‌ర్ ఔటైనా అమంజోత్ కౌర్ (0)తో క‌లిసి కెప్టెన్ హ‌ర్మన్‌ ముంబైకి విజ‌యాన్ని అందించింది. హ‌ర్మ‌న్‌-కెర్ జోడి ఐదో వికెట్‌కు 66 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో తనూజా కన్వర్ రెండు వికెట్లు తీసింది. కాథరిన్ బ్రైస్, లీ తహుహు చెరో వికెట్ సాధించారు.

ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవ‌రికంటే..?

ముంబై ప్లేయ‌ర్ అమేలియా కెర్ ను ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వ‌రించింది. బౌలింగ్‌లో నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌డంతో పాటు బ్యాటింగ్‌లో 31 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ పై గెలుపుతో ముంబై పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానానికి చేరుకుంది.

Yashasvi Jaiswal : ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో జైస్వాల్ ప‌రుగుల వ‌ర‌ద‌.. కోహ్లి రికార్డు స‌మం..