Dope Test : డోపింగ్ కలకలం.. యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మకు నోటీసులు.. 7 రోజులు గడువు
Dope Test : ఇండియన్ క్రికెట్ లో మరోసారి డోపింగ్ వార్తలు తెర మీదకు వచ్చాయి. ఇద్దరు స్టార్ క్రికెటర్లకు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.
NADA notices to Yashasvi Jaiswal and Shafali Verma for missed dope tests
Dope Test : ఐపీఎల్ సీజన్ జోరుగా సాగుతున్న వేళ ఇండియన్ క్రికెట్ లో సంచలన సంఘటన చోటు చేసుకుంది. డోపింగ్ కలకలం చెలరేగడంతో.. ఇద్దరు స్టార్ ప్లేయర్లకు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ తో పాటు మహిళా క్రికెటర్ షఫాలీ వర్మలు గతేడాది డోపింగ్ టెస్టుకు హాజరుకానందున.. వారికి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. జైస్వాల్, షఫాలీ ఇద్దరు డోప్ టెస్ట్ కు హాజరుకాకపోవడాన్ని నాడా (NADA) తీవ్రంగా పరిగణించింది. వీరు డోప్ టెస్టుకు హాజరు కాకుండా.. నిబంధనలు ఉల్లంఘించారని భావించిన నాడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే.. నాడా నిబంధనల ప్రకారం.. ‘రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్’ (RTP)లో ఉన్న ఆటగాళ్లు.. తాము ఎక్కడ ఉంటున్నాము అనే దాని గురించి ముందుగానే సమాచారం అందించాల్సి ఉంటుంది. నివేదికల ప్రకారం, డిసెంబర్ 17, 2025న డోప్ కంట్రోల్ ఆఫీసర్లు (DCOs) నమూనాలను సేకరించడానికి వెళ్ళినప్పుడు యశస్వి జైస్వాల్ తను ఇచ్చిన చిరునామాలో లేరు. మరోవైపు, నవంబర్ 7, 2025న నమూనా సేకరించడానికి అధికారులు వచ్చినప్పుడు షఫాలీ వర్మ అందుబాటులో లేరు.
దీనిపై వీరిద్దరూ వివరణ ఇవ్వాలని నాడా ఆటగాళ్లకు నోటీసులు పంపింది. అయినా వారి నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నాడా అధికారికంగా దీన్ని పరీక్షకు గైర్హాజరుగా నమోదు చేసింది. ఈ సందర్భంగా నాడా అధికారి ఒకరు మాట్లాడుతూ.. “సంబంధిత అథ్లెట్లకు నోటీసులు జారీ చేశాము. ఇదే విషయాన్ని జాతీయ ఫెడరేషన్ (BCCI), ICC కి కూడా తెలియజేశాము” అన్నారు.
బీసీసీఐ కూడా ఈ పరిణామాలను ధృవీకరించింది. ఆటగాళ్లు ఈ పరీక్షకు ఎందుకు గైర్హాజరయ్యారో వారితో మాట్లాడి తెలుసుకుంటామని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. క్రికెట్ మళ్ళీ ఇప్పుడు ఒలింపిక్స్‌లో చేరింది. కనుక ఇకపై ప్రతిదీ సజావుగా సాగడానికి తాము అన్ని ప్రోటోకాల్‌లను పాటిస్తామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నాడా వీరిద్దరి పేర్లపై ‘మిస్డ్ టెస్ట్’ నమోదు చేసి, డోప్ టెస్టులకు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇచ్చేందుకు గాను ఆటగాళ్లకు ఏడు రోజుల సమయం ఇచ్చారు.
డోప్ టెస్ట్ మిస్ అయితే వచ్చే పరిణామాలు:
బీసీసీఐ, ఐసీసీ కఠినమైన యాంటీ డోపింగ్ నిబంధనలను కలిగి ఉన్నాయి. అలానే నాడా నిబంధనల ప్రకారం, అథ్లెట్లు తమ ఉనికిని ఏజెన్సీతో పంచుకోవాలి. ప్రతిరోజూ నిర్ణీత సమయంలో పరీక్షకు అందుబాటులో ఉండాలి. ఒకవేళ వరుసగా మూడు సార్లు పరీక్షకు గైర్హాజరైతే, దానిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఇది నిషేధానికి (Suspension) దారితీయవచ్చు. గతంలో 2019లో, పృథ్వీ షా తెలియకుండానే నిషేధిత పదార్థం ఉన్న దగ్గు మందును సేవించినందుకు నాడా ఆయనపై ఎనిమిది నెలల పాటు నిషేధం విధించింది.
