Naveen ul Haq : ఆస్ట్రేలియా పై చారిత్రాత్మక విజయం.. విమర్శకులే లక్ష్యంగా నవీన్ ఉల్ హక్ పోస్ట్..
అఫ్గానిస్తాన్ జట్టును ఇక నుంచి ఎవరైనా చిన్న జట్టు అని అంటారా..?

Naveen ul Haq Burns Internet With His Post After Historic Win Over Australia
అఫ్గానిస్తాన్ జట్టును ఇక నుంచి ఎవరైనా చిన్న జట్టు అని అంటారా..? సంచలనాలను సృష్టించడం అలవాటుగా మార్చుకుని పెద్ద జట్లకు షాకులు ఇస్తోంది. టీ20ప్రపంచకప్‌లో సూపర్ 8లో మాజీ ఛాంపియన్, అగ్రశేణి ఆటగాళ్లతో నిండిన ఆస్ట్రేలియాకు గట్టి షాకిచ్చింది. 21 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో ప్రస్తుతం అఫ్గాన్ జట్టు పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ ఆటగాళ్లతో పాటు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
తన జట్టును విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకోవడంతో పాటు, జట్టుకు మద్దతు లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ అఫ్గానిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ సోషల్ మీడియాలో ఓ రహస్య పోస్ట్‌ను పంచుకున్నాడు. ఓ ఫోటోను షేర్ చేశాడు. ఇందులో ప్రస్తుతం తమకు అందుతున్న అభినందనలతో పోలిస్తే.. కష్ట సమయాల్లో తన జట్టుకు మద్దతు లేకపోవడాన్ని హైలెట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
USA vs ENG : యువరాజ్ సింగ్ సిక్సర్ల రికార్డును కాపాడిన ఫిలిప్ సాల్ట్.. లేదంటేనా..?
అఫ్గాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (60; 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (51; 48 బంతుల్లో 6ఫోర్లు) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ వరుసగా రెండో హ్యాటిక్ అందుకున్నాడు. ఆడమ్ జంపా రెండు వికెట్లు తీశాడు.
అనంతరం అఫ్గాన్ బౌలర్లు చెలరేగడంతో లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడింది. 19.2 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లల్లో మాక్స్‌వెల్ (59; 41 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్సర్లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన వారు విఫలం కావడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్ నాలుగు వికెట్లతో ఆసీస్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు నవీనుల్ హక్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇది ఓ గొప్ప విజయం..
ఓ జట్టుగా, ఓ దేశంగా ఇది తమకు ఓ గొప్ప విజయం అని అఫ్గానిస్తాన్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ అన్నాడు. ఆసీస్ వంటి జట్టుపై విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. ఓ జట్టుగా చాలా గర్వపడుతున్నాం. ప్రత్యర్థిని బట్టే తుది జట్టు ఎంపిక ఉంటుందని, అందుకనే ప్రతి మ్యాచ్‌లోనూ జట్టులో మార్పులు ఉంటున్నాయని చెప్పుకొచ్చాడు.
WI vs SA : దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఇది డబ్ల్యూడబ్ల్యూఈ కాదు భయ్యా..
ఇక కింగ్స్ టౌన్ పిచ్ పై 140 పరుగులను మంచి స్కోరుగా భావించాము. బ్యాటింగ్‌లో మంచి ఆరంభం లభించిందని, అయితే.. దాన్ని కొనసాగించడంలో విఫలం అయినట్లు తెలిపాడు. మా ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శనతోనే ఇదంతా సాధ్యమైంది. తదుపరి మ్యాచుల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తామని చెప్పాడు.