IND vs BAN: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్ లో నమోదైన రికార్డులు ఇవే..

టీ20 ఫార్మాట్ లో అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన జట్టుగా టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు

Team india

IND vs BAN 3rd T20 Match: బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. మూడో మ్యాచ్ శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకు పడ్డారు. ఫలితంగా 133 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అనేక రికార్డులు నమోదయ్యాయి. టీమిండియా చేసిన 297 పరుగులు టీ20 క్రికెట్ చరిత్రలో రెండో అ్యతధిక స్కోరు. సంజూ శాంసన్ 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేయడం నుంచి ఇన్నింగ్స్ లో మొత్తం 22 సిక్సర్లు బాదిన వరకు, ఈ మ్యాచ్ లో టీమిండియా సరికొత్త రికార్డులను నమోదు చేసింది.

♦   టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. బంగ్లా జట్టుపై టీమిండియా కేవలం 7.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును అధిగమించింది. అంతకుముందు 2019లో టీమిండియా ఎనిమిది ఓవర్లలో 100 పరుగులు చేసిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.

♦   టీ20 ఫార్మాట్లో తొలి పది ఓవర్లలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. బంగ్లాపై మ్యాచ్ లో 10 ఓవర్లలో టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 152 పరుగులు చేసింది. తొలి స్థానంలో ఆస్ట్రేలియా జట్టు ఉంది. స్కాట్లాండ్ జట్టుపై 10 ఓవర్లలో ఆస్ట్రేలియా 156 పరుగులు నమోదు చేసింది.

♦   టీ20 ఫార్మాట్ లో అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన జట్టుగా టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు 84 బంతుల్లోనే (14 ఓవర్లు) 200 పరుగులు పూర్తి చేసింది. గతేడాది వెస్టిండీస్ పై దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో 200 పరుగులను నమోదు చేసింది.

♦   టీ20 ఫార్మాట్లో పవర్ ప్లే లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఆరు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి భారత్ జట్టు 82 పరుగులు చేసింది. అంతకుముందు స్కాట్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆరు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది.\

♦   టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీ20ల్లో అత్యధిక బౌండరీల రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్ లో 47 బౌండరీలు నమోదయ్యాయి.

♦   టీ20ల్లో భారత్ జట్టు తరపున వేగంగా సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా సంజూ శాంసన్ నిలిచాడు. సంజూ 40 బంతుల్లో 100 పరుగులు పూర్తిచేయగా.. 2017లో శ్రీలంక జట్టుపై 35 బంతుల్లో రోహిత్ శర్మ సెంచరీ కొ్ట్టాడు.