ప్లాస్టిక్ వ్యర్థాలతో లంక క్రికెట్ జెర్సీ

ప్లాస్టిక్ వ్యర్థాలతో లంక క్రికెట్ జెర్సీ

Updated On : May 8, 2019 / 2:52 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యేకత కోసం ఆయా జట్లు తమ జెర్సీలను కొత్త డిజైన్లతో రూపొందిస్తున్నాయి. ఇదిలా ఉంటే, లంక క్రికెట్ బోర్డు మాత్రం వైవిధ్యంగా, పర్యావరణ హితంగా ఆలోచించింది. సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలతో జెర్సీ రూపొందించి విడుదల చేసింది. కొత్త లుక్‌తో కనపడుతుండటంతో పాటు, ఆలోచింపజేసేలా ఉండటంతో లంక కొత్త జెర్సీ ప్రశంసలు అందుకుంటోంది. 

వరల్డ్ కప్ స్పెషల్‌గా రూపొందించిన జెర్సీనే ప్లేయర్లంతా వినియోగించనున్నారు. లంక జట్టు తొలిసారి 1996లో ప్రపంచకప్‌ గెలుచుకుంది. ఆ తర్వాత 2007, 2011లో ఫైనల్‌కు చేరినప్పటికీ ఆస్ట్రేలియా, భారత్‌ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా సరిపెట్టుకుంది. 

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 మే 30 నుండి ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు 15 మంది సభ్యులతో కూడిన జట్లను ప్రకటించేశాయి.  వరల్డ్ కప్ టోర్నీలో 10జట్లు పాల్గొంటుండగా లండన్‌లోని ఐకానిక్ ది ఓవల్ స్టేడియంలో తొలి మ్యాచ్‌‌ను ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు ఆడనున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న రోజ్ బౌల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడనుంది.