Astrotalk CEO Puneet Gupta
ODI World Cup 2023 Final Match : యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరికొద్ది గంటల్లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ ఫైట్ లో తలపడనున్నాయి. ఇప్పటివరకు ఎనిమిది సార్లు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన ఆసీస్ ఐదు సార్లు విజేతగా నిలిచింది. భారత్ రెండు సార్లు విశ్వవిజేతగా గెలిచింది. ఈ సారి ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ ను ముద్దాడాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఇప్పటికే ప్రపంచ కప్ లో ఆడిన 10 మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ లోనూ విజేతగా నిలవాలని దేశ ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
Also Read : IND vs AUS : నేడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్.. అహ్మదాబాద్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా ఢీ
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించాలని దేశ ప్రజలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రోటాక్ కంపెనీ సీఈవో పునీత్ గుప్తా బంపర్ ఆఫర్ ఇచ్చాడు. టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2023 విజేతగా నిలిస్తే తమ వినియోగదారులకు రూ. 100 కోట్లు పంచుతానని ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించాడు. 2011లో భారత్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు కాలేజీలో చదువుకుంటున్నా. ఆ రోజు ఫ్రెండ్స్ తో కలిసి ఆడిటోరియంలో మ్యాచ్ చూశా. మ్యాచ్ జరుగుతున్నంత సేపు మాకు టెన్షనే. ఆ టోర్నీలో టీమిండియా విజయం సాధించిన తరువాత నా ఆనందానికి అవదుల్లేకుండా పోయాయని పునీత్ గుప్తా చెప్పారు.
ఈసారి టీమిండియా వరల్డ్ కప్ విజేతగా నిలిస్తే నా ఆనందాన్ని పంచుకునేందుకు సిద్ధమయ్యా. అయితే, ఈసారి ఆస్ట్రోటాక్ వినియోగదారులతో తన ఆనందాన్ని పంచుకోవాలని అనుకుంటున్నా. భారత్ విజేతగా నిలిస్తే మా సంస్థ యూజర్లందరికీ రూ. 100 కోట్లను సమానంగా పంచాలని నిర్ణయం తీసుకున్నట్లు పునీత్ గుప్తా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టులో తెలిపారు.
టీమిండియా వరల్డ్ కప్ విజేతగా నిలిస్తే జట్టు సభ్యులకు గుజరాత్ బీజేపీ నేత కెయూర్ థోలారియా బంపర్ ఆఫర్ ప్రకటించారు. జట్టు కోచ్ తోసహా 16 మంది టీం సభ్యులకు 16 ప్లాట్లు ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. రాజ్ కోట్ లోని భయాసార్ – ఖథ్ రోట్ శివరాం జెమినీ పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్లాంట్లను టీం సభ్యులకు అందజేస్తానని కెయూర్ థోలారియా చెప్పారు. ఇక్కడ ఒక్కో ప్లాట్ విలువ రూ. 10లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు.