PAK Vs NZ Match Prediction: గెలిస్తేనే నిలిచేది..! పాక్ సెమీస్ ఆశలు నిలుపుకుంటుందా? గత రికార్డుల్లో ఏ జట్టుది పైచేయి అంటే..

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. గత 10 వన్డే మ్యాచ్ లలో ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు భారీ స్కోర్లు చేశాయి. అయితే..

PAK Vs NZ Match

ODI World Cup 2023 PAK vs NZ : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 లీగ్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఓటమి లేకుండా విజయాల పరంపరను కొనసాగిస్తూ వచ్చిన టీమిండియా సెమీఫైనల్ లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికా జట్టుసైతం దాదాపు సెమీస్ లోకి అడుగు పెట్టింది. మూడు, నాలుగు స్థానాలకోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు పోటీ పడుతున్నాయి. మూడో స్థానంలో ఆస్ట్రేలియా సెమీస్ కు చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక నాల్గో స్థానంలో సెమీస్ కు చేరే జట్టు ఏదో ఈరోజు మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఉదయం 10.30 గంటల నుంచి న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఒకవేళ పాకిస్థాన్ ఓడిపోతే ఇంటిబాట పట్టాల్సిందే.

కివీస్ కు ఈ మ్యాచ్ కీలకం..
ఇవాళ జరిగే న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి సెమీ ఫైనల్ ఆశలను పదిలం చేసుకోవాలని కోరుకుంటోంది. అయితే ఈ జట్టు ఆటగాళ్లు గాయాల బెడద వేదిస్తోంది. కివీస్ లో విశ్వసనీయ నివేదికల ప్రకారం.. 10 మంది మాత్రమే పూర్తిగా ఫిట్ గా ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో గాయపడి టోర్నీకి దూరమయ్యాడు. అంతేకాక.. జిమ్మీ నీషమ్ తన కుడిచేతి మోచేయి గాయంతో బాధపడుతున్నాడు. మార్క్ ఛాంప్ మన్ గాయంతో పోరాడుతున్నాడు. ప్రధాన కెప్టెన్ కేన్ విలియమ్సన్ బొటనవేలు గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు.

గత రికార్డుల్లో పాక్ దే పైచేయి ..
పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మొత్తం 115 వన్డే మ్యాచ్ లు జరిగాయి. పాకిస్థాన్ 60, న్యూజిలాండ్ 51 మ్యాచ్ లలో విజయం సాధించాయి. రెండు జట్ల మధ్య గత ఐదు వన్డే మ్యాచ్ ల ఫలితాలను పరిశీలిస్తే.. పాకిస్థాన్ జట్టు నాలుగు సార్లు విజయం సాధించగా.. న్యూజిలాండ్ జట్టు కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. వన్డే వరల్డ్ కప్ విషయానికివస్తే .. గత ఐదు ప్రపంచ కప్ లలో ఒక్క 2011 టోర్నమెంట్ లో మినహా ప్రతీసారి న్యూజిలాండ్ పై పాకిస్థాన్ విజయం సాధిస్తూ వచ్చింది. గత రికార్డులను పరిశీలిస్తే పాకిస్థాన్ జట్లు కివీస్ జట్టుపై పైచేయి సాధించింది. అయితే, ప్రస్తుత వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆటతీరు పేలవంగా ఉంది.. దీంతో న్యూజిలాండ్, పాక్ మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని క్రికెట్ ప్రియులు అంచనా వేస్తున్నారు.

పిచ్ పరిస్థితి ఇలా..
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. గత 10 వన్డే మ్యాచ్ లలో ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు సగటు స్కోరు 304. అయితే.. ఈ మైదానంలో ఎక్కువ జట్లు ఛేజింగ్ చేయడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే.. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన జట్లు 60శాతం విజయం సాధించాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటర్లకు ఉపయోగపడే పిచ్ పై టాస్ గెలిచిన జట్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మధ్యాహ్నం సమయంలో ఇక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా) : డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ.

పాకిస్థాన్ తుది జట్టు (అంచనా) : అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తికర్ అహ్మద్, సౌద్ షకీల్, అఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్.

ట్రెండింగ్ వార్తలు