Rohit Sharma
ODI World Cup 2023 Rohit Sharma : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా విజయ జైత్రయాత్ర కొనసాగుతోంది. లక్నో వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టీమిండియా విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. అయితే, మేము గొప్పగా ఆడలేదని అనిపిస్తుందని రోహిత్ వ్యాఖ్యానించారు. బౌలర్లు అద్భుతంగా రాణించారని, అందులో ఎలాంటి సందేహం లేదని, కానీ మా బ్యాటింగ్ విషయంలో ఆశించిన స్థాయిలో రాణించలేదని అనిపిస్తోందని చెప్పుకొచ్చాడు.
టోర్నమెంట్ లో మేముఆడిన ఐదు మ్యాచ్ ల కంటే జట్టులోని ప్రతి ప్లేయర్ కు కఠిన పరీక్ష పెట్టిన మ్యాచ్ ఇది. ఇక్కడ మేము మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో మాకు పెద్ద సవాలు ఎదురైంది. పిచ్ లో ఏదో ఉందని మాకు తెలుసు.. మా బౌలింగ్ విభాగం బలంగా ఉంది. కాబట్టి మేము మెరుగైన రన్స్ చేయాలని భావించాం. కానీ, మరో 30 పరుగులు తక్కువ చేశామని నేను భావిస్తున్నా.. నాతో సహా టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయాం. అన్నిసార్లు ఇలా ఉంటుందని అనుకోవటం పొరపాటు. బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది కాబట్టిసరిపోయింది.. లేకుంటే తక్కువ స్కోరులో ప్రత్యర్థిపై విజయం సాధించడం పెద్దసవాలుగా ఉండేదని రోహిత్ అన్నారు.
బ్యాటింగ్ సమయంలో మొదటి పది ఓవర్లు భాగస్వామ్యాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. అయితే, ఈ మ్యాచ్ లో మేం ఆశించిన పరుగులు చేయలేకపోయిన.. మా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లను కోలుకోకుండా చేశారు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకొని చెలరేగిపోయారు. స్వింగ్ తో పాటు పిచ్ నుంచి కూడా తమకు సహకారం లభించడంతో ఇంగ్లాండ్ కు బ్యాటింగ్ చాలా కష్టంగా మారిపోయింది. మా బౌలర్ల అనుభవం కూడా మాకు కలిసొచ్చిందని రోహిత్ అన్నారు. మొదటి బ్యాటింగ్ చేసినప్పుడు ప్రత్యర్థి జట్టుకు తక్కువ స్కోర్ ను లక్ష్యంగా ఉంచితే బౌలర్లపైనా ఒత్తిడి పడుతుందని రోహిత్ అన్నారు.