Teamindia
Rohit Sharma: వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ లో టీమిండియా విజయయాత్ర కొనసాగుతోంది. ఓటమి లేకుండా వరుసగా ఎనిమిది మ్యాచ్ లు గెలిచింది. ఆదివారం సాయంత్రం ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేయగా.. రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో సఫారీ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించారు. ఫలితంగా భారీ పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టు చిత్తయింది. ఈ మ్యాచ్ లోనూ టీమిండియా ప్లేయర్స్ ఫల్డింగ్ లో అదరగొట్టారు.
వరల్డ్ కప్ 2023లో టోర్నమెంట్ లో మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రమాణాలతో పాటు సహచరుల్లో ఉత్సాహం నింపే ఆటగాడిని ఎంపిక చేసి బెస్ట్ ఫీల్డర్ మెడల్ ను టీమిండియా మేనేజ్ మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ డ్రెస్సింగ్ రూమ్ లో ఉత్తమ ఫీల్డర్ పేరును ప్రకటించి మెడల్ ను అందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా జట్టుపై విజయం అనంతరం ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఉత్తమ ఫీల్డర్ పతకాన్ని ప్రకటించారు. ఈసారి ఉత్తమ ఫీల్డర్ గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఉత్తమ ఫీల్డర్ మెడల్ ను శ్రేయాస్ అయ్యర్ రోహిత్ శర్మకు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
ఈ వీడియో ప్రకారం.. ఇండియా – సౌతాఫ్రికా మ్యాచ్ లో టీమిండియా ఉత్తమ ఫీల్డర్ మెడల్ ఎవరికి వచ్చిందో తెలుసుకొనేందుకు ప్లేయర్స్ అందరూ మైదానంలోకి వచ్చారు. వారంతా ఒకదగ్గర రౌండ్ గా నిల్చొని ఉండగా.. వారి వద్దకు మొబైల్ క్యామ్ వచ్చి ఆగింది. ఆ క్యామ్ అందరివైపు తిరగడం ప్రారంభించింది. అది ఎవరివైపు ఆగితే వారు ఉత్తమ ఫీల్డర్ మెడల్ కు ఎంపికైనట్లు. దీంతో ఆ మొబైల్ క్యామ్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైపుకు ఆగిపోయింది. వెంటనే ఇషాన్ కిషన్ తో పాటు పలువురు ప్లేయర్స్ రోహిత్ ను హత్తుకొని అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.