ODI World Cup-2023: గుడ్‌న్యూస్.. శుభ్‌మన్ గిల్ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చిన రోహిత్ శర్మ

ఈ మ్యాచులో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు చెప్పాడు. అలాగే, హార్దిక్ పాండ్యాను..

Rohit Sharma

Rohit Sharma: ప్రపంచ కప్‌-2023లో భారత్ ఆడే తొలి మ్యాచుకు టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ డెంగీ కారణంగా దూరమవుతున్నాడంటూ జరుగుతున్న ప్రచారంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో మ్యాచు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇవాళ రోహిత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గిల్ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చాడు.

గిల్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ అతడిని మ్యాచుకు దూరంగా ఉంచాలని తాము ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని రోహిత్ శర్మ చెప్పాడు. గిల్ కోలుకుంటున్నాడని, అతడి నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు తెలిపాడు.

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచులో ఇతర ప్లేయర్ల గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ… ఈ మ్యాచులో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు చెప్పాడు.

హార్దిక్ పాండ్యా గురించి..

అలాగే, హార్దిక్ పాండ్యాను కేవలం సీమర్‌గానే కాకుండా సమర్థవంతమైన ఫాస్ట్ బౌలర్‌గానూ చూస్తానని అన్నాడు. ఇది తమకు మరింత సానుకూల అంశమని తెలిపాడు. ఆదివారం తాము మరోసారి పిచ్‌ను పరిశీలిస్తామని, ఏదేమైనా ముగ్గురు స్పిన్నర్లను తీసుకోవడమే మంచి ఆప్షన్ అని చెప్పాడు. చెన్నై స్టేడియంలో ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత్ ఓడిపోయింది. ఆ మ్యాచులో చేసిన పొరపాట్ల నుంచి టీమిండియా పాఠాలు నేర్చుకుందని రోహిత్ శర్మ తెలిపారు.

World Cup 2023 RSA Vs SL ODI : మార్క్రామ్ విధ్వంస‌క‌ర శ‌త‌కం..