Sachin Tendulkar on Blue Tick
Sachin Tendulkar on Blue Tick:టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసిన తరువాత చాలా మార్పులకు శ్రీకారం చుట్టాడు. అధికారిక ఖాతా గుర్తించేందుకు చిహ్నంగా ఉన్న బ్లూటిక్(వెరిఫైడ్ బ్యాడ్జ్) సబ్‌స్ర్కిప్షన్ ద్వారా కొనుగోలు చేయాలంటూ ప్రకటించాడు. ఇందుకు ఏప్రిల్ 20 వరకు గడువు ఇచ్చాడు. అన్నట్లుగానే నెలవారీ సబ్ స్క్రిప్షన్ తీసుకోని వారి బ్లూ టిక్(Blue Tick)ను తీసివేశాడు. దీంతో దేశంలోని పలువురు సినీ, రాజకీయ, క్రీడాకారులు తమ ట్విటర్ ఖాతా బ్లూ టిక్ లను కోల్పోయారు. అందులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కూడా ఉన్నారు.
ప్రస్తుతం ఒరిజినల్ అకౌంట్ ఏదీ అన్నది తెలుసుకోవడం అన్నది కాస్త కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓ యూజర్ సచిన్ టెండూల్కర్‌ను ఓ ప్రశ్న అడిగాడు. ఇందుకు మాస్టర్ తమదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. #AskSachin పేరుతో టెండూల్కర్ ఓ సెషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ యూజర్..”ఇప్పుడు, మీకు బ్లూ టిక్ లేదు. మీరు నిజమైన సచిన్ టెండూల్కర్ అని మేము ఎలా గుర్తుపట్టాలి.” అని అభిమాని అడుగగా సచిన్ ఇలా బదులు ఇచ్చాడు. తన ఫోటోను పోస్ట్ చేశాడు. అందులో తన చేతి వేళ్లను టిక్ మాదిరిగా ఉంచాడు. ఇదే నా బ్లూ టిక్ వెరిఫికేషన్ అంటూ రాసుకొచ్చాడు. సచిన్ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
As of now, this is my blue tick verification! ? https://t.co/BSk5U0zKkp pic.twitter.com/OEqBTM1YL2
— Sachin Tendulkar (@sachin_rt) April 21, 2023
ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, ఒలింపిక్ పతక విజేతలు సైనా నెహ్వాల్, నీరజ్ చోప్రా, బజరంగ్ పునియా, రెజ్లర్ వినేష్ ఫోగట్, రెండు సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, సానియా మీర్జా, భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి , పురుషుల హాకీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ తదితర క్రీడాకారులు బ్లూ టిక్‌ను కోల్పోయిన వారిలో ఉన్నారు.