WCL 2025 effect PCB Takes Stunning Decision
భవిష్యత్‌లో తమ క్రికెటర్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)లో పాల్గొబోరని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు పూర్తిస్థాయి నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. పాకిస్థాన్ లెజెండ్స్‌పై సెమీఫైనల్ ఆడకుండా ఇండియా లెజెండ్స్ జట్టు డబ్ల్యూసీఎల్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అనంతరం డబ్ల్యూసీఎల్ చేసిన ప్రకటనలు ద్వంద్వ వైఖరితో ఉన్నాయని పీసీబీ ఆరోపించింది.
డబ్ల్యూసీఎల్ 2025 ఎడిషన్‌లో పాకిస్థాన్‌తో మ్యాచుల్లో ఆడేందుకు ఇండియా రెండు సార్లు నిరాకరించింది. హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, పఠాన్ బ్రదర్స్ వంటి ఆటగాళ్లు మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేయాల్సి వచ్చింది. ఇండియా సెమీస్‌కి అర్హత సాధించినప్పటికీ, పాక్‌తో ఆడడం ఇష్టంలేక ఆ తర్వాత టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. దీంతో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరింది. ఇందులో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది.
పీసీబీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇండియా స్వచ్ఛందంగా మ్యాచ్ వీడినప్పటికీ పాయింట్ ఎలా ఇచ్చారని పీసీబీ ప్రశ్నించింది. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నక్వి 79వ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల సమావేశానికి వర్చువల్‌గా హాజరై, డబ్ల్యూసీఎల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
“వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)లో పాల్గొనకుండా భవిష్యత్‌లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) పూర్తిస్థాయి నిషేధం విధిస్తోంది. న్యాయంగా, తటస్థంగా నిర్వహించాల్సిన ఈవెంట్ బయటి వ్యక్తుల ప్రభావానికి లోనైతే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇకపై పాల్గొనదు” అని ప్రకటనలో పీసీబీ పేర్కొంది.