చనిపోయి మళ్లీ బతకాలనుకుంటున్నారా? రిజిస్టర్ చేసుకోండి.. ఇప్పటికే 650 మంది చేసుకున్నారు.. జర్మన్ సంస్థ ఏం చేస్తోందంటే?

ఇప్పటి వరకు ఈ సంస్థ నలుగురు వ్యక్తులను, ఐదు పెంపుడు జంతువులను క్రియోప్రెజర్వేషన్ చేసింది.

చనిపోయి మళ్లీ బతకాలనుకుంటున్నారా? రిజిస్టర్ చేసుకోండి.. ఇప్పటికే 650 మంది చేసుకున్నారు.. జర్మన్ సంస్థ ఏం చేస్తోందంటే?

Updated On : August 3, 2025 / 3:55 PM IST

చనిపోయిన వారు బతకడం అసాధ్యం. కానీ, జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని స్టార్టప్ సంస్థ “టుమారో బయో” మాత్రం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ప్రయత్నిస్తోంది. Tomorrow.Bio అనేది యూరప్‌లోని మొదటి క్రయానిక్స్ ల్యాబ్. దాని లక్ష్యం మరణం తర్వాత వ్యక్తులను ఫ్రీజ్ చేసి, భవిష్యత్‌లో బతికించడం.

మానవ మృతదేహాన్ని సురక్షితంగా నిల్వచేసి, భవిష్యత్‌లో మళ్లీ అందులో జీవాన్ని నింపాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. 200,000 డాలర్లు (సుమారు రూ.1.74 కోట్లు) చెల్లిస్తే మృతదేహాన్ని అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచి ఫుల్ బాడీ క్రియోప్రెజర్వేషన్ చేస్తారు. క్రియోప్రెజర్వేషన్ అంటే అతితక్కువ ఉష్ణోగ్రతతో శరీరాన్ని గడ్డకట్టించి జీవకణాలు పాడుకాకుండా నిరోధించే ప్రక్రియ.

ఈ సంస్థ 24/7 ఎమర్జెన్సీ స్టాండ్‌బై టీమ్‌ను ఉంచింది. మనిషి చనిపోయాడని చట్టపరంగా సర్టిఫికెట్ తీసుకున్న వెంటనే క్రియోప్రెజర్వేషన్ ప్రక్రియ మొదలవుతుంది. భవిష్యత్తులో వైద్య రంగంలో జరిగే అభివృద్ధి చనిపోయిన ఆ వ్యక్తిని మళ్లీ బతికించగలవన్న ఆశతో “టుమారో బయో” ఈ విధానాన్ని ప్రారంభించింది.

Also Read: మనుషులను మించిపోయేలా త్వరలోనే ఏఐ సొంతంగా భాషను అభివృద్ధి చేసుకోవచ్చు.. ఇదే జరిగితే..: ఏఐ గాడ్‌ఫాదర్ జాఫ్రీ హింటన్

ఇప్పటివరకు 650 మందికిపైగా వ్యక్తులు ఈ సర్వీసుకు రిజిస్టర్ చేసుకున్నారు. వారు చనిపోయిన తర్వాత క్రియోప్రెజర్వేషన్ ప్రక్రియను మొదలు పెడతారు. సైన్స్‌పై నమ్మకంతో భవిష్యత్తులో, మళ్లీ బతకగలమన్న ఆశతో వారు దీనికి రిజిస్టర్ చేసుకున్నారు.

ఇప్పటి వరకు ఈ సంస్థ నలుగురు వ్యక్తులను, ఐదు పెంపుడు జంతువులను క్రయో ప్రిజర్వ్ చేసింది. 2025లో అమెరికా వ్యాప్తంగా ఈ సర్వీసును విస్తరించాలని “టుమారో బయో” లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటివరకు ఎవ్వరినీ సక్సెస్‌ఫుల్‌గా తిరిగి బతికించలేదు. ఒకవేళ బతికించినా మెదడులోని చాలా భాగం దెబ్బతినే అవకాశముంది. మానవ మస్తిష్కంలాంటి సంక్లిష్టమైన వ్యవస్థలను తిరిగి పూర్తిగా సజీవంగా చేయడం సాధ్యపడుతుందన్న ఆధారాలు లేవని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

“సున్నా డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రత చేరితే శరీరాన్ని నిశ్చలంగా ఉంచాలి. లేకపోతే మంచు స్ఫటికాలు ఏర్పడి కణజాలం నాశనం అవుతుంది” అని Tomorrow.Bio సహ వ్యవస్థాపకుడు ఎమిల్ కెన్జియోర్రా వివరించారు. అతను గతంలో కాన్సర్ పరిశోధకుడు. ఇప్పుడు ఈ సంస్థలో ప్రాక్టికల్, రీసెర్చ్ రంగాల్లో పనిచేస్తున్నారు.