మనుషులను మించిపోయేలా త్వరలోనే ఏఐ సొంతంగా భాషను అభివృద్ధి చేసుకోవచ్చు.. ఇదే జరిగితే..: ఏఐ గాడ్‌ఫాదర్ జాఫ్రీ హింటన్
నెట్‌వర్క్‌డ్ ఇంటెలిజెన్స్ కారణంగా ఏఐ సమగ్రంగా అభివృద్ధి చెందుతోంది. GPT4 వంటి ప్రస్తుత మోడల్స్ ఇప్పటికే సాధారణ జ్ఞానంలో మానవులను మించిపోయాయి.

Geoffrey Hinton
కృత్రిమ మేధ వల్ల భవిష్యత్తులో మానవాళికి ఊహించని విధంగా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని ఇప్పటికే కొంతమంతి భయాందోళనలు వ్యక్తం చేశారు. నోబెల్ బహుమతి విజేత, ఏఐ గాడ్‌ఫాదర్‌గా పరిగణించే జెఫ్రే హింటన్ కూడా ఇదే విషయంపై మరోసారి హెచ్చరిక జారీచేశారు.
వన్ డిసిషన్ పాడ్‌కాస్ట్‌లో ఆయన తాజాగా మాట్లాడుతూ.. ఏఐ త్వరలో మానవులు అర్థం చేసుకోలేని ఒక అంతర్గత భాషను అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. “ఇప్పుడు ఏఐ సిస్టమ్స్ ‘చైన్ ఆఫ్ థాట్’ రీజనింగ్‌ను ఇంగ్లీషులో చేస్తున్నాయి. కాబట్టి మనం అవి చేస్తున్న పనిని ఫాలోచేయగలం. కానీ, అవి ఒక అంతర్గత భాషను అభివృద్ధి చేసుకుంటే, పరిస్థితి భయంకరంగా మారుతుంది” అని అన్నారు. ఒక ఆలోచనను దశలవారీగా అభివృద్ధి చేయడాన్నే చైన్ ఆఫ్ థాట్ అంటారు.
Also Read: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చివరి బంతికి పాక్‌ను చిత్తుచేసిన వెస్టిండీస్..
మెషీన్లు ఇప్పటికే “భయంకరమైన” ఆలోచనలను సృష్టించే సామర్థ్యాన్ని చూపించాయి. హింటన్ చేసిన కామెంట్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆయనకు 2024 ఫిజిక్స్ లో నోబెల్ దక్కింది. ఆయన న్యూరల్ నెట్‌వర్క్‌లపై చేసిన పరిశోధనలే నేటి డీప్ లెర్నింగ్ మోడల్స్‌కు పునాది వేశాయి.
తన కెరీర్‌లో చాలా ఆలస్యంగా ప్రమాదాలను పూర్తిస్థాయిలో గ్రహించానని ఆయన అన్నారు. భద్రత గురించి తొందరగా ఆలోచించి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోందని హింటన్ అన్నారు. ఏఐ అన్ని విషయాలను నేర్చుకునే తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
నెట్‌వర్క్‌డ్ ఇంటెలిజెన్స్ కారణంగా ఏఐ సమగ్రంగా అభివృద్ధి చెందుతోంది. GPT4 వంటి ప్రస్తుత మోడల్స్ ఇప్పటికే సాధారణ జ్ఞానంలో మానవులను మించిపోయాయి. రీజనింగ్ (తార్కిక ఆలోచన సామర్థ్యం) మాత్రం ఇప్పటివరకు మనుషులదే. అయితే, హింటన్ అభిప్రాయం ప్రకారం అది కూడా త్వరగానే తగ్గిపోతుంది. “పెద్ద కంపెనీల్లో చాలామంది ప్రమాదాలపై బయటకు ఏమీ చెప్పరు.. కానీ, వారి లోపల మాత్రం ఆందోళన ఉంటుంది” అని అన్నారు.