WI vs PAK: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చివరి బంతికి పాక్‌ను చిత్తుచేసిన వెస్టిండీస్..

నరాలుతెగేలా సాగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు చిత్తయింది. విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ చివరి బంతికి ఫోర్ కొట్టి పాకిస్థాన్ జట్టుకు దిమ్మతిరిగే షాకిచ్చాడు.

WI vs PAK: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చివరి బంతికి పాక్‌ను చిత్తుచేసిన వెస్టిండీస్..

WI vs PAK 2nd T20 Match

Updated On : August 3, 2025 / 2:46 PM IST

WI vs PAK: నరాలుతెగేలా సాగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు చిత్తయింది. విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ చివరి బంతికి ఫోర్ కొట్టి పాకిస్థాన్ జట్టుకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. తద్వారా రెండు వికెట్ల తేడాతో వెస్టిండీస్ జట్టు ఘన విజయం సాధించింది.

పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. వెస్టిండీస్ బౌలర్ జాసెన్ హోల్డర్ అద్భుత బౌలింగ్ ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. పాకిస్థాన్ బ్యాటర్ హసన్ నవాజ్ (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లు తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టారు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కీలక బ్యాటర్లు తక్కువ పరుగులకే వెంటవెంటనే ఔట్ అయ్యారు. దీంతో విండీస్ జట్టు ఓటమి అంచుకు చేరింది. అయితే, చివరిలో జాసన్ హోల్డర్ (16), షెఫర్డ్ (15) దూకుడుగా ఆడడంతో విండీస్ తిరిగి గేమ్ లోకి వచ్చింది. ఈ క్రమంలో విండీస్ జట్టు విజయానికి ఒక్క ఓవర్లో ఎనిమిది పరుగులు కావాల్సి వచ్చింది. ఆ సమయంలో షాహిన్ అఫ్రీది బౌలింగ్ చేశాడు.

హోల్డర్ తొలి బంతికి సింగిల్ తీయగా.. రెండో బంతికి షెఫర్డ్ ఔటయ్యాడు. తరువాత మూడు బంతుల్లో మూడు పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి విండీస్ విజయం సాధించడానికి నాలుగు పరుగులు అవసరం అయ్యాయి. ఆ సమయంలో షాహీన్ అఫ్రీది వైడ్ వేయడంతో విండీస్ విజయానికి ఒక్క బంతికి మూడు పరుగులు కావాల్సి వచ్చింది. క్రీజులో హోల్డర్ ఉన్నాడు. చివరి బంతిని బౌండరీకి తరలించడంతో విండీస్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆగస్టు 4న జరగనుంది.

ఈ మ్యాచ్ లో జాసన్ హోల్డర్ ఆల్ రౌండ్ ప్రతిభకుగాను మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అనంతరం పాకిస్థాన్ జట్టు ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా మాట్లాడుతూ.. మేము పరుగులు రాబట్టడంలో విఫలం అయ్యాం. బౌలింగ్, ఫీల్డింగ్ లో మెరుగైన ప్రదర్శన చేశాం. ఇంత తక్కువ స్కోర్ లో విజయం సాధించేందుకు శాయశక్తులా పోరాడాం. కానీ, ఫలితం ఆశించిన విధంగా రాలేదు. వచ్చే మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శనతో విజయాన్ని అందుకుంటాం అని చెప్పాడు.