Pakistan enter into super 4 in Asia Cup 2025
Asia Cup 2025 : ఆసియాకప్ 2025లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించింది. బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో పాక్ 41 పరుగుల తేడాతో గెలుపొంది సూపర్ 4కి అర్హత సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఫకార్ జమాన్(50; 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. షాహిన్ షా అఫ్రిది(29 నాటౌట్; 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిక్ నాలుగు వికెట్లు తీశాడు. సిమ్రంజిత్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ధ్రువ్ పరాషర్ ఒక వికెట్ సాధించాడు.
Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆస్ట్రేలియా పై ఫాస్టెస్ట్ సెంచరీ..
అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 17.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. యూఏఈ బ్యాటర్లలో రాహుల్ చోప్రా (35; 35 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), ధ్రువ్ పరాషర్ (20; 23 బంతుల్లో 1 ఫోర్) లు రాణించారు. మిగిలిన వారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్ లు తలా రెండు వికెట్లు తీశారు. సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘా లు ఒక్కొ వికెట్ సాధించారు.
మళ్లీ భారత్, పాక్ పోరు..
గ్రూప్-ఏ నుంచి భారత్, పాక్ జట్లు సూపర్-4లో అడుగుపెట్టాయి. ఒమన్, యూఏఈ జట్లు గ్రూప్ స్టేజీ నుంచే నిష్ర్కమించాయి. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ మరోసారి ఆసియాకప్ 2025(Asia Cup 2025 )లో తలపడనున్నాయి. సూపర్-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 21) న దుబాయ్ వేదికగా తలపడనున్నాయి.
గత ఆదివారం (సెప్టెంబర్ 14న) భారత్, పాక్‌లు దుబాయ్ వేదికగానే తలపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. కాగా.. మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయని సంగతి తెలిసిందే. ఈ వివాదం తరువాత మరోసారి భారత్, పాక్ లు తలపడనుండడంతో ఏం జరుగుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.