T20 World Cup 2026
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026ను బహిష్కరించే యోచనలో పాకిస్థాన్ ఉన్నట్లు ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి నెలలో టీ20 వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. అయితే, భారత్‌లో తమ మ్యాచ్‌లను ఆడలేమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకోవటంతో.. ఐసీసీ మెగా టోర్నీ నుంచి ఆ జట్టును తొలగించింది. బంగ్లాదేశ్ జట్టు స్థానంలో స్కాట్లాండ్ ను ఎంపిక చేసింది. అయితే, మొదటి నుంచి బంగ్లాదేశ్ కు మద్దతుగా నిలుస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సైతం టీ20 వరల్డ్ కప్ ను బహిష్కరిస్తుందన్న ప్రచారం క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
పాకిస్థాన్ జట్టు టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి తప్పుకుంటే ఆ దేశ క్రికెట్ బోర్డుకు గట్టి షాకిచ్చేందుకు ఐసీసీ సిద్ధమైంది. దీంతో ఆదివారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి 15మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. దీంతో పాకిస్థాన్ దారికొచ్చిందని అందరూ భావించారు. కానీ, మళ్లీ పాకిస్థాన్ కొత్త డ్రామా ఆడుతోంది.
బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో తమ జట్టును ఆడించొద్దని పాకిస్థాన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, ఒకవేళ టోర్నీలో పాల్గొన్నా.. భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు యోచిస్తోందని ఆ దేశ మీడియా పేర్కొటుంది. ఈ రెండు కాకుంటే .. టోర్నీలో పాకిస్థాన్ సాధించే ప్రతి విజయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ మద్దతుదారులకు అంకితం చేయాలని పీసీబీ భావిస్తోందట. అయితే, తాజాగా.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ తో పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ భేటీ అయ్యారు.
టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నఖ్వీ పాకిస్థాన్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదేసమయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి.. ఏ చేయాలని అనుకుంటుంది అనే అంశాలను ప్రధానికి నఖ్వీ వివరించినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ప్రధానితో భేటీ అనంతరం నఖ్వీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
ప్రధాని మియాన్ ముహమ్మద్ నవాజ్ షరీఫ్‌తో కీలక సమావేశం జరిగింది. ఐసీసీ తీసుకున్న నిర్ణయం గురించి ఆయనకు వివరించాను. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ముందున్న ఎంపికలనుసైతం ఆయన దృష్టికి తీసుకెళ్లాను. బోర్డు ముందున్న ఎంపికలను పరిగణలోకి తీసుకుంటూనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని ఆదేశించారు. శుక్రవారం లేదా వచ్చే సోమవారం టీ20 వరల్డ్‌కప్ 2026లో పాకిస్థాన్ ఆడుతుందా..? లేదా.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఫైనల్ నిర్ణయం తీసుకుందామని ప్రధాని ముహమ్మద్ నవాజ్ షరీఫ్ చెప్పారని నఖ్వీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
T20 World Cup 2026