Pakistan knocked out of Womens World Cup 2025
Womens World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇక లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకోగా.. తాజాగా ఈ టోర్నీ (Womens World Cup 2025) నుంచి పాకిస్తాన్ నిష్ర్కమించింది. ఇప్పటి వరకు పాక్ ఆరు మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 150 పరుగుల తేడాతో ఓడిపోవడంతో అధికారికంగా సెమీస్ రేసు నుంచి పాక్ నిష్ర్కమించింది.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. లారా వోల్వార్డ్ (90; 82 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు), సునే లూస్ (61; 59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మారిజాన్ కాప్ (68; 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. ఆఖరిలో నాడిన్ డి క్లెర్క్ (41; 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో సపారీలు భారీ స్కోరు సాధించారు. పాక్ బౌలర్లలో నష్రా సంధు, సాదియా ఇక్బాల్ చెరో మూడు వికెట్లు తీశారు.
Sarfaraz Khan : ఏం తప్పు చేశాడని.. సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు ఇవ్వలేదు..
ఆ తరువాత పాక్ ఇన్నింగ్స్ సమయంలో మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో పాక్ లక్ష్యాన్ని 20 ఓవర్లలో 234 గా నిర్ణయించారు. పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 83 పరుగులే చేసింది. సిద్రా నవాజ్ (22 నాటౌట్) టాప్ స్కోరర్. దక్షిణాఫ్రికా బౌలర్లలో మారిజాన్ కాప్ మూడు వికెట్లు తీసింది.
భారత్‌లోనే ఫైనల్..
పాక్ జట్టు సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించడంతో ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ భారత్ వేదికగా జరనుంది. ఒకవేళ పాక్ ఫైనల్‌కు వచ్చి ఉంటే అప్పుడు ఫైనల్ మ్యాచ్ కొలంబో వేదికగా జరగాల్సి ఉండేది. లీగ్ స్టేజ్‌లోనే పాక్ టోర్నీ నుంచి నిష్ర్కమించడంతో నవీ ముంబై వేదికగా నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటికే సెమీస్ బెర్తులను ఖాయం చేసుకున్నాయి. మరో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, శ్రీలంకలు పోటీపడుతున్నాయి.